కర్ణాటక రెబెల్స్ పై కోర్టు తీర్పు.. రేపు!

Update: 2019-07-16 11:44 GMT
తమ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించడం లేదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కర్ణాటక రెబెల్స్ వ్యవహారం ఈ  రోజు తేలిపోతుందని అంతా చెప్పుకొచ్చారు. మంగళవారం ఇందుకు సంబంధించిన తీర్పు రావొచ్చని ఆ రాజకీయం మీద ఆసక్తి ఉన్న వాళ్లు ఎదురుచూశారు. రాజీనామాలు ఇచ్చిన రెబెల్స్ పై కోర్టు ఎలా స్పందిస్తుందో సర్వత్రా ఆసక్తి వ్యక్తం అయ్యింది.

అయితే ఈ అంశంపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. బుధవారం అందుకు సంబంధించిన తీర్పును ఇవ్వబోతున్నట్టుగా కోర్టు ప్రకటించింది. బుధవారం ఉదయం పదిన్నరకు కోర్టు ఈ విషయంలో స్పందించబోతోందని  సమాచారం.

తమ రాజీనామాలను ఆమోదించాలని రెబెల్స్ పట్టుపట్టారు. స్పీకర్ వాటిని ఆమోదించడం లేదని కోర్టుకు ఫిర్యాదు చేశారు. అయితే రాజీనామాలు చేసిన వారు తన ముందుకు రావాలని, వారిలో కొందరి రాజీనామాలు సరైన ఫార్మాట్ లో లేవని స్పీకర్ ప్రకటించారు. అలాగే రాజీనామా చేసిన తమను శాసనసభకు హాజరు కావాలంటూ స్పీకర్ ఒత్తిడి చేస్తున్నారంటూ ఎమ్మెల్యేలు కోర్టుకు తెలిపారు.

అయితే ఇలాంటి రాజీనామాలను ఆమోదించడం చాలా వరకూ స్పీకర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. స్పీకర్ రాజీనామాలను, అనర్హత వేట్లను తన అధికారం మేరకు పర్యవేక్షిస్తుండటాన్ని అంతా గమనిస్తూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో స్పీకర్ అధికారాల మీద కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే చర్చనీయాంశంగా నిలుస్తోంది.

మంగళవారంతోనే అందుకు సంబంధించిన తీర్పు రాబోతోందని అంతా ఎదురుచూశారు. అయితే కోర్టు ఈ వ్యవహారాన్ని బుధవారానికి వాయిదా వేసింది. గురువారం కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి సర్కారు విశ్వాస పరీక్షను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెబెల్స్ విషయంలో కోర్టు ఏం చెబుతుందనేది అంశంపై ఉత్కంఠ కొనసాగుతూ ఉన్నట్టే!
Tags:    

Similar News