పవన్ విషయంలో సస్పెన్స్ కంటిన్యూస్...

Update: 2021-03-29 08:30 GMT
తిరుపతి లోక్ సభ అభ్యర్ధిగా రత్నప్రభ ప్రచారం విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటీ ముట్టనట్లున్నారు. మొదటినుండి ఉపఎన్నికలో పోటీ చేయటానికి జనసేన తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. మొదటినుండి ఏమీ తేల్చని బీజేపీ నేతలు చివరినిముషంలో మాత్రం పోటీచేసే అవకాశాన్ని తామే లాగేసుకున్నారు. దాంతో పవన్+జనసేన నేతలు మండిపోతున్నారు. ఈ కారణంతోనే రత్నప్రభ పోటీ చేస్తుందని ప్రకటన వచ్చిన దగ్గర నుండి ఇప్పటికీ అంటీముట్టనట్లే ఉన్నారు.

అభ్యర్ధితో పాటు బీజేజే చీఫ్ సోము వీర్రాజు - జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి తదితరులు స్వయంగా పవన్ ఇంటికి వెళ్ళి మరీ కలిశారు. ప్రచారానికి రమ్మని ఆహ్వానించినా ఇప్పటివరకు పనవ్ పట్టించుకోలేదు. పోటీచేసే విషయంలో బీజేపీ అగ్రనేతలపై పవన్ ఇంకా అసంతృప్తిగానే ఉన్నట్లు దీన్నిబట్టి అర్ధమైపోతోంది. ఇదే విషయాన్ని రత్నప్రభ కూడా పరోక్షంగా అంగీకరించారు.

తిరుపతిలో మీడియాతో జనసేన చీఫ్ గురించి రత్నప్రభ  మాట్లాడుతు ప్రచారానికి తనను ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని పవన్ తనకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తనను ఆహ్వానిస్తే ప్రచారానికి వస్తానని పవన్ చెప్పినట్లు అభ్యర్ధే స్వయంగా చెప్పారు. నిజానికి మిత్రపక్షం తరపున ప్రచారం చేయాల్సిన బాధ్యత పవన్+జనసేన నేతలమీదుంది. అలాంటిది రత్నప్రభ ప్రచారంలోకి దిగిన తర్వాత పవన్ కాదుకదా చివరకు జనసేన తరపున ఎవరు ప్రచారంలో కనబడలేదు.

మొదటినుండి రెండు పార్టీల మధ్య సంబంధాలు అంతంతమాత్రమే. ఏదో మిత్రపక్షాలంటే మిత్రపక్షాలుగా పేరుకు మాత్రమే ఉన్నాయంతే. ఏ విషయంలో కూడా బీజేపీ పవన్ కు కనీస మర్యాదకూడా ఇవ్వలేదు.  ఈ విషయాన్ని స్వయంగా పవనే బహిరంగంగా తీవ్ర అసంతృప్తిని బయటపెట్టిన  విషయం తెలిసిందే.

ఇదే సమయంలో గతంలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలను రత్నప్రభ అభినందిస్తు ట్వీట్ చేశారు. అదిపుడు బాగా వైరల్ అవుతోంది. ఇదే విషయమై ఆమె క్లారిటి ఇస్తు జగన్ ప్రభుత్వాన్ని గతంలో తాను ప్రశంసించిన విషయం వాస్తవమేనన్నారు. అభినందించినంత మాత్రాన తాను జగన్ కు మద్దతిచ్చినట్లా ? అని అడిగారు. ఏదేమైనా అప్పడు చేసిన ఓ ట్వీట్ ఇఫుడు ఆమెను ఇబ్బంది పెడుతోందనే చెప్పాలి.  ఇలాంటి నేపధ్యంలో ఇప్పటివరకు రత్నప్రభ తరపున పవన్ ప్రచారంలోకి రాలేదంటే ఇక జనసేన నేతలు వస్తారా ? డౌటే.
Tags:    

Similar News