టీడీపీలో అసమ్మతి సెగ.. ఈ సీటు పోయినట్టేనా?

Update: 2019-03-09 05:21 GMT
పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లోనూ పసుపు జెండా ఎగిరింది. అలాంటి కంచుకోటలో ఇప్పుడు సీట్‌ ఫైట్‌ నడుస్తోంది. ఓ వైపు కొవ్వూరు పంచాయతీ ఇంకా తేలలేదు. తాజాగా నిడదవోలు రగడ పార్టీకి తలనొప్పిగా మారింది. జిల్లాలో రిజర్వుడు సీట్లు మినహా దాదాపు అన్ని సీట్లలో అభ్యర్థులు ఖరారయ్యారు. నిడదవోలులో మాత్రం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది.

2009లో కొత్తగా ఏర్పాటైన నిడదవోలులో టీడీపీ తరుఫున నిలబడ్డ బూరుగుపల్లి శేషారావు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు. ఆ తరువాత నుంచి ఆయనపై టీడీపీలో వ్యతిరేకత మొదలైంది. రెండోసారి గెలిచిన తరువాత గ్రూపులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు శేషారావు. ప్రతి గ్రామంలోనూ గ్రూపులను పెట్టారని టీడీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నవారిని పక్కనబెట్టి తన వారి కోసం రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇసుక వ్యవహారంలో ఎమ్మెల్యేపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. మరోవైపు సొంత ఇంట్లోనూ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు శేషారావు. ఈయన అన్నయ్య వేణుగోపాలం ఈసారి తనకే సీటు వస్తుందని ఆశిస్తున్నారు. ఇంకోవైపు శేషారావు కుటుంబంలో ఎవరికి సీటు ఇచ్చినా పార్టీకి నష్టం కలుగుతుందని తెలుపుతున్నారు పార్టీ కార్యకర్తలు. ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న తనకే సీటు ఇవ్వాలని కోరుతున్నారు మరో టీడీపీ నేత కందుల సత్యనారాయణ.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే శేషారావు మాత్రం మూడోసారి తానే పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఓ వైపు పార్టీ కార్యకర్తల నినాదాలు - మరోవైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యే అభిప్రాయాలను బేరిజు వేసుకొని అధిష్టానం ఎవరికి సీటు కేటాయిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. మొత్తంగా ఈ అసమ్మతి పరిణామాలతో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ  ఓడిపోయే సీట్లలో నిడదవోలు ముందుందని రాజకీయ విశ్లేషకులు ఘంఠా పథంగా చెబుతున్నారు.
   

Tags:    

Similar News