టీడీపీ అతి సెల్ఫ్ గోల్ అయినట్లుందే...

Update: 2016-11-21 22:30 GMT
ప్ర‌తి స‌మ‌స్య‌పైనా ఒకింత‌ అతిగా స్పందించే తెలుగుదేశం పార్టీ ఇపుడు అదే పాయింట్ ఆధారంగా చిక్కుల్లో ప‌డింద‌ని అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న‌ పెద్ద నోట్లు రద్దు ప్రభావం టీడీపీ సభ్యత్వంపై పడిందంటూ ఆ పార్టీ నాయకులు ప్రకటిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే పెద్దనోట్లను రద్దు చేస్తే టీడీపీ సభ్యత్వ నమోదుకు అడ్డంకి ఎలా మారిందన్న సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు టీడీపీ సభ్యత్వానికి- పెద్దనోట్ల రద్దుకు ఉన్న లింకేంటి? అన్న సందేహన్ని ప‌లువురు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్లు రద్దు నిర్ణయంతో టీడీపీ ఎదుర్కోంటోన్న ఇబ్బందేమిటంటే... పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన సభ్యత్వం ముందుకు సాగ‌డం లేద‌ట‌.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పెద్ద నోట్లు రద్దు చేయాలని దేశంలో డిమాండ్‌ చేసిన మొట్టమొదటి రాజ‌కీయ‌వేత్త‌. తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున గత నాలుగేళ్ల నుంచి డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. ఆ విషయం అటుంచితే...తాజాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే వంద రూపాయలు చెల్లించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వంద ఉన్నోడు మహారాజు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. సో... ఉన్న వంద పార్టీకి చెల్లించి, సభ్యత్వం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. వంద నోట్ల చలామణి విరివిగా మార్కెట్లోకి వస్తే తప్ప ఉన్న వందను ఖర్చు చేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఈ పరిస్థితే సభ్యత్వ నమోదు మందగించడానికి కారణమైందట. అయితే సభ్యత్వ నమోదు ఫీజును పెద్ద నాయకులే భరించడం ఆనవాయితీగా వస్తున్నది. పెద్దనేతల వద్ద ఉన్న పాతనోట్లు చలామణి లేక సభ్యత్వ రుసుం చెల్లించకపోవడంతోనే సభ్యత్వ నమోదులో జాప్యం జరుగుతుందని కిందిస్థాయి నాయకులు సైతం పేర్కొంటున్నారు. దీనికి తోడు సభ్యత్వ నమోదు చేసే బృందంలో చాలా మంది యువత ఉన్నారు. వారు కూడా తమకు కాస్త సమయం కావాలని కోరుతున్నారట. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు నెమ్మదించిందని చెబుతున్నారు. దీంతో త‌మ పార్టీ మ‌ద్ద‌తిచ్చిన అంశం త‌మ‌కే రివ‌ర్స్ అయింద‌ని తెలుగు త‌మ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.


Tags:    

Similar News