తెలుగు త‌మ్ముళ్లు..ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెల‌వ‌లేద‌ట‌!

Update: 2018-07-06 13:39 GMT
గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌న్న భావ‌న టీడీపీ  అధినేత నారా చంద్ర‌బాబునాయుడికి నిద్ర ప‌ట్ట‌నీయ‌లేద‌న్న విశ్లేష‌ణ‌లు లెక్క‌లేన‌న్ని వినిపించిన మాట తెలిసిందే. ఎన్నిక‌ల‌కు ముందుగా జ‌రిగిన దాదాపు అన్ని స‌ర్వేలు కూడా వైసీపీదే విజ‌య‌మ‌ని - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం కావ‌డం ఖాయ‌మ‌ని తేల్చేశాయి. అయితే ఈ స‌ర్వేల‌న్నింటినీ క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత చంద్ర‌బాబు త‌న‌దైన శైలి పోల్  మేనేజ్ మెంట్‌ కు తెర తీశార‌ని, ఫ‌లితంగా అతి కొద్ది తేడాతో ఆయ‌న పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించార‌ని నాటి పోల్ గ‌ణాంకాలను  చూస్తే ఇట్టే అర్థ‌మైపోతోంది.  మొత్తంగా ఎన్నిక‌ల్లో  ఎలాగైతే గెలుస్తామ‌న్న విష‌యంపై ప‌క్కా అవగాహ‌న ఉన్న చంద్ర‌బాబు... ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకునేందుకు లెక్క‌లేన‌న్ని హామీలు ఇవ్వ‌డ‌మే కాకుండా... పోలింగ్ లో త‌నదైన మార్కు య‌త్నాకు తెర తీశార‌ని - ఫ‌లితంగానే ఆయ‌న పార్టీ అభ్య‌ర్థులు అత్య‌ధిక మంది విజ‌యం సాధించార‌ని నాడు పుకార్లు వినిపించాయి. అయితే ప్ర‌జాస్వామ్యంలో ఎలా పోలింగ్ జ‌రిగింద‌న్న విష‌యానికి అంత‌గా ప్రాధాన్యం ఉండ‌దు. బ్యాలెట్ బాక్సులో ఎన్ని ఓట్ల‌ను సాధించార‌న్న‌దే ఇక్కడ ప్రాధాన్యం.

అయినా ఎన్నిక‌లు జ‌రిగి నాలుగేళ్లు పూర్తి అయిన త‌ర్వాత ఇప్పుడీ విష‌యం ఎందుక‌నేగా మీ ప్ర‌శ్న‌? గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో తాము ఎలా గెలిచామ‌న్న విష‌యంపై నిన్న‌టిదాకా  సింగిల్ మాట కూడా ప‌ల‌క‌ని టీడీపీ ఎమ్మెల్యేలు... ఇప్పుడు బాగానే ఓపెన్ అయిపోతున్నారు. ఇందులో భాగంగానే తూర్పు గోదావ‌రి జిల్లా పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి ఎమ్మెల్యేగా ఎన్నికైన పుల‌వ‌ర్తి నారాయ‌ణ మూర్తి ఇప్పుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. తానేమీ ప్ర‌జ‌లు వేసిన ఓట్ల‌తో గెల‌వ‌లేద‌ని త‌న‌కు ఓట్లేసిన ప్ర‌జ‌ల  ముందే చెప్పేసిన మూర్తి... అంద‌రినీ షాక్‌ కు గురి చేశారు. ఈ వ్యాఖ్య ఆయ‌న నోట నుంచి రావ‌డానికి కార‌ణ‌మైన ఘ‌ట‌న వివరాల్లోకి వెళితే... త‌న‌ నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం చింతలపూడి  ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన మూర్తిని అక్క‌డి మహిళలు దాదాపుగా నిలదీసినంత ప‌నిచేశారు.

పదేళ్లుగా రోడ్లు - డ్రైనేజీలు - మంచినీటి సదుపాయాలు లేవని - ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని భ‌గ్గుమ‌న్న మ‌హిళంతా ఎమ్మెల్యేను అక్క‌డే నిల‌బెట్టేశారు. మ‌హిళ‌లంతా ఒక్క‌సారిగా తిర‌గ‌బ‌డినంత ప‌నిచేయ‌డంతో మూర్తి షాక్  తిన్నారు. అయితే ప్ర‌జా  ప్ర‌తినిధులన్నాకా ప్ర‌జ‌ల‌కు షాక్ ఇస్తారు త‌ప్పించి... ప్ర‌జ‌ల నుంచి షాక్‌ ల‌ను కోరుకోరు క‌దా. ఇక్క‌డా అలాగే జ‌రిగింది. ప్ర‌జ‌లు త‌న‌కు షాకిస్తే... అందుకు ఆగ్ర‌హించిన  తెలుగు త‌మ్ముడు... సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన మహిళలపై ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. మీరు ఓట్లేస్తేనే గెలిచామా? అంటూ ఆయ‌న ఫైరేపోయారు. మొత్తంగా ప్ర‌జ‌ల ఓట్ల‌తో తాను గెల‌వ‌లేద‌ని - త‌మ పార్టీ అధినేత పోల్  మేనేజ్ మెంట్‌ తోనే తాను గెలిచాన‌న్న చందంగా మూర్తి త‌న‌దైన శైలిలో వీరంగ‌మాడారు. మ‌రి మూర్తి గారి మాట‌లు చంద్ర‌బాబు చెవిన ప‌డ్డాయో - లేదో చూడాలి.
Tags:    

Similar News