బెజ‌వాడ టీడీపీలో ఇదో ర‌కం రాజ‌కీయం.. ఎవ‌రు మారుస్తారో?!

Update: 2022-06-19 03:30 GMT
బెజ‌వాడలో టీడీపీ అంటే.. బ‌ల‌మైన కంచుకోట‌గా పేర్కొంటారు. ఇక్క‌డ కీల‌క‌మైన నాయ‌కులు.. పార్టీ పిలుపు ఇస్తే.. వంద‌ల మంది ని తీసుకువ‌చ్చే నాయ‌కులు ఉన్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలిపించేనాయ‌కులే క‌నిపించ‌డం లేద‌నే టాక్ జోరుగా విని పిస్తోంది. దీనికి కార‌ణం.. ఎవ‌రికి వారే.. య‌మునా తీరే.. అన్న‌చందంగా.. నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం.. టీడీపీ అధినేత జిల్లాల ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ఇదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు క‌లియ దిర‌గాల‌ని ఆయ‌న ఆదేశించారు. ప్ర‌తి ఒక్క‌రూ నియోజ‌క‌వ‌ర్గాల్లో వారానికి మూడు రోజులైనా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవాల‌న్నారు.

ఇది మ‌హానాడు వేదిక‌గా చేసుకున్న అద్భుత‌మైన తీర్మానంగా చంద్ర‌బాబు అభివ‌ర్ణించారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల్లో ఉన్న‌వారికే టికెట్లు ఇస్తాన‌ని చెప్పారు. వారికే ప్రాధాన్యం ఉంటుంద‌ని అన్నారు. ఫ‌లితంగా నిద్రాణంగా ఉన్న శ్రేణులు ముందుకు కదులుతా య‌ని ఆయ‌న ఆశించారు. ఇది నిజ‌మే. ఈ ప్ర‌యోగం.. చాలా చోట్ల ఫ‌లించింది. చాలా మంది నాయ‌కులు ముందుకు క‌దులుతు న్నారు.

వైసీపీపై క‌సితోనో.. లేక‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ లు ద‌క్క‌వ‌నే భ‌యంంతోనో నాయ‌కులు ముందుకు వ‌స్తున్నా రు. అయితే.. బెజ‌వాడ‌లో మాత్రం నాయ‌కులు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నా.. ఎంపీ కేశినేని వ‌ర్గం మాత్రం ఆయ‌న‌కు దూరంగా ఉంటోంది. దీంతో అస‌లు బెజ‌వాడ‌లో ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది.

ప్ర‌స్తుతం బెజ‌వాడ‌లోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు చోట్ల మాత్ర‌మే టీడీపీకి ప‌ట్టుంది. దీంతో పాటు ఎంపీ స్థానం టీడీపీ ఖాతాలోనే ఉంది. తూర్పు, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ బ‌లంగా ఉంది. ఇక‌, ప‌శ్చిమ‌లో ఎవ‌రూ పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు. దీనికి కార‌ణం.. వైసీపీ నుంచి వ‌చ్చిన జ‌లీల్ ఖాన్‌కు టీడీపీ పెద్ద‌పీట వేసింద‌ని.. తాము ప‌నికిరాలేదా? అని ఇక్క‌డి నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, ఎంపీ కూడా ప‌శ్చిమ‌పై క‌న్నేసినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఆశించిన‌ట్టుకుమార్తెకు టికెట్ ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో ఆయ‌న‌కూడా నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ హ‌డావుడి చేసినా.. సైలెంట్ అయ్యారు.

ఇక‌, మిగిలిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. త‌మ‌కు త‌ప్ప టికెట్లు ఎవ‌రికి ఇస్తార‌నే ధోర‌ణిలో నాయ‌కులు ఉన్నారు. దీంతో ఈ రెండు చోట్ల కూడా పార్టీ నేత‌లు ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది. తూర్పులో ఒకింత ఫ‌ర్వాలేదు కానీ, సెంట్ర‌ల్‌లో ఓడిపోయిన నాయ‌కుడు.. బొండా ఉమా అస‌లు ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌డం లేదు.

ఏదైనా ఉంటే.. మీడియా ముందుకు రావ‌డం మిన‌హా.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మ‌న‌సు పెట్టి ఉద్య‌మించిన రోజు ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా లేద‌ని.. టీడీపీ నేత‌లే గుస‌గుస‌లాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ బ‌లోపేతం అవుతుందా?  లేక‌.. నాయ‌కులు ఆధిప‌త్యంతో అల్లాడుతుందా? అనేది ఇక్క‌డి నాయ‌కుల ప్ర‌శ్న‌. మ‌రి ఇప్ప‌టికైనా.. చంద్ర‌బాబు అంద‌రినీ క‌లపుకొని వెళ్లేలా.. నాయ‌కుల‌ను ముందుకు న‌డిపించాల‌ని కోరుతున్నారు.
Tags:    

Similar News