దేశంలోనే చాణక్యుడు కేసీఆర్ కూడా డమ్మీనే.. జగన్ ది అదే దారి!

Update: 2022-06-09 17:30 GMT
నాయకుడంటే నడిపించాలి.. ప్రజలను ఏకం చేయాలి. కార్యకర్తలను సమీకరించాలి. ముందుండి పోరాడాలి. అప్పుడే ప్రజల మనసు గెలిచి వారి ఓట్లు సంపాదించి ఎదుగుతారు. సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడు ఢిల్లీ సీఎం అయ్యాడంటే అతడికి ప్రజల్లో ఉన్న విశ్వసనీయతే కారణం.

దాన్ని పెంచుకుంటేనే నాయకులు గెలుస్తారు. సీఎంలు అవుతారు. కానీ ఇప్పుడు నేతలు అలాంటివి చేయకుండా.. కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో కూర్చొని ఒక రాజకీయ వ్యూహకర్తను పెట్టుకొని అతడు చెప్పినట్టు చేస్తూ గెలిచేస్తున్నారు. తమ సొంత వ్యూహాలను పక్కనపెట్టి రాజకీయ వ్యూహకర్తలు ఆడించినట్టు ఆడుతున్నారు.

దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడిలా కేసీఆర్ ఉంటారు. ఆయన ఆలోచనలు, వ్యూహాలను ప్రత్యర్థులు ఇప్పటికీ ఛేదించలేకపోతున్నారు. అంతలా వ్యూహాలు పన్ని ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఓడిస్తున్నారు. తెలంగాణను సాధించుకున్న తీరు.. అనంతరం ఆ పార్టీకి అధికారం దక్కకుండా చేసి గెలిచి.. రెండోసారి గెలుపు పల్లకీ ఎక్కిన ఘనత కేసీఆర్ దే.

అయితే మూడోసారి గెలుపు కోసం ఆయన తన సొంత ఐడియాలజీని పక్కనపెట్టి దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై ఆధారపడడం హాట్ టాపిక్ గా మారింది. అంతపెద్ద కేసీఆర్ యే ఇలా ఎన్నికలకు భయపడి.. ప్రజల నాడి తెలియకుండా వ్యూహకర్తలను ఆశ్రయించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

కేసీఆర్ యే కాదు.. బెంగాల్ లో ధీర వనిత అయిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా పీకేను ఆశ్రయించారు. ఇక తమిళనాడులో స్టాలిన్.. ఏపీలో జగన్ సైతం సొంత ఐడియాలజీ కంటే కూడా వ్యూహకర్తలనే నమ్ముకున్నారు.

ఎన్నికల్లో గెలవాలంటే ముందుగా ప్రజాభిమానం చూరగొనాలి. ప్రజలే గెలిపిస్తారు. ఈ వ్యూహకర్తలు ఒకసారో రెండో సార్లు పనిచేస్తారు. కానీ ప్రజలకు దూరంగా.. వారి సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఎందరు వ్యూహకర్తలు వచ్చినా గెలిపించలేరు. అందుకే ప్రజా బలం ముందు ఏ వ్యూహకర్త బలం సరిపోదు అనేది. ఇప్పటికైనా నేతలు వీరిపై ఆధారపడడం తగ్గించి సొంత సామర్థ్యంపై ఆలోచిస్తే మంచిది అని పలువురు సూచిస్తున్నారు.
Tags:    

Similar News