కేసీఆర్ జోస్యం నిజమవుతుందా ?

Update: 2022-09-04 04:20 GMT
తాజాగా జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కేసీయార్ కొన్ని అంశాలపై జోస్యం చెప్పినట్లే ఉంది. ఆ అంశాలేమిటంటే తొందరలోనే ఈడీ, సీబీఐ దాడులు చేస్తుందట. అలాగే ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్ఎస్ కు 80-90 సీట్లు ఖాయమన్నారు. తొందరలో జరగబోయే మునుగోడు ఉపఎన్నికలో 200 శాతం  టీఆర్ఎస్సే గెలుస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారు. కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలిస్తే బీజేపీది మూడోస్ధానమే అని కేసీయార్ చెప్పారు.

ఇక జోస్యాల గురించి చెప్పుకుంటే ఎన్పోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ దాడులు జరగచ్చని ఎందుకు కేసీయార్ అనుమానిస్తున్నారు ? ఎక్కడైనా పొగుంటేనే నిప్పు రాజుకుంటుందని కేసీయార్ కు తెలీదా ? దాడులు చేసేందుకు ఈడీ, సీబీఐలకు ఎవరు అవకాశం ఇవ్వద్దని మంత్రులను కేసీయార్ హెచ్చరించటమే  ఆశ్చర్యంగా ఉంది. ఇపుడు అవకాశం ఇవ్వటం కాదు గడచిన ఎనిమిదిన్నరేళ్ళ పాలనలో ఎక్కడైనా అవినీతి జరిగుంటే దానిపైనే దర్యాప్తు సంస్ధలు దాడులు చేస్తాయి.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నది ఎక్కువగా కేసీయార్ కుటుంబమే. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీయార్ వేలకోట్ల రూపాయలు దోచుకున్నారని, పంపు హౌస్ నిర్మాణంలో కూడా భారీ అవినీతి జరిగిందని స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. సో ఈడీ, సీబీఐ దాడులు చేస్తే అది ముందుగా కేసీయార్ కుటుంబంపైనే జరుగుతుందనే ప్రచారం తెలిసిందే.

ఇక ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్ఎస్ కు 90 సీట్లు వస్తాయని చెప్పటాన్ని ఎవరు నమ్మటం లేదు. ఎందుకంటే ఏ వర్గాన్ని కదలించినా కేసీయార్ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వినబడుతోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేల్లో కూడా మెజారిటీ ఎంఎల్ఏలపైన జనాల్లో బాగా వ్యతిరేకత ఉందని రిపోర్టు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ కేసీయార్ అధికారంలోకి రావటమంటే అనుమానమే. ఇక మునుగోడులో గెలుపుకు అవకాశముంది. కాంగ్రెస్-బీజేపీ ఎంతగా పుంజుకుంటే టీఆర్ఎస్ కు అంత అడ్వాంటేజ్ అవుతుంది.
Tags:    

Similar News