స‌బ్జెక్టు ఒక్క‌టే... మార్కులే మూడు ర‌కాలు

Update: 2019-06-02 13:38 GMT
20 - 48 - 21... ఇవేవో ర్యాంకులు కావు. అలాగ‌ని ప‌లువురు విద్యార్థుల‌కు ప‌లు స‌బ్జెక్టుల్లో వ‌చ్చిన మార్కులూ కాదు. అలాగ‌ని ఒకే విద్యార్థికి వేర్వేరు స‌బ్జెక్టుల్లో వ‌చ్చిన మార్కులు అస‌లే కాదు. మ‌రి ఇంకేంటి? అంటారా? ఒకే విద్యార్ఙికి ఒకే స‌బ్జెక్టులో వ‌చ్చిన ఒకే ద‌ఫా వ‌చ్చిన మార్కులు. అదెలా సాధ్య‌మంటే?  తెలంగాణ ఇంట‌ర్ బోర్డు మాదిరి వ్య‌వ‌హారం ఉంటే... ఇదేంటీ... ఇంకేదైనా సాధ్య‌మే. మొన్న‌టి ఫ‌లితాల్లో బోర్డు నిర్ల‌క్ష్య వైఖ‌రికి ఈ ఉదంత‌మే అద్దం ప‌డుతోంద‌ని చెప్పాలి.

 తెలంగాణ ఇంట‌ర్ బోర్డు మాయాజాలం ఇంతింత కాద‌యా అన్న‌ట్లుగా ఉంది ప‌రిస్థితి. బోర్డు నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఇప్ప‌టికే తెలంగాణ‌లో 25 మంది విద్యార్థులు బ‌ల‌వ‌న్మ‌రణాల‌కు పాల్ప‌డితే... బోర్డు వైఖ‌రిలో మాత్రం ఇసుమంతైన మార్పు కూడా రాలేద‌నే చెప్పాలి. ప‌రీక్ష‌లు బాగా రాశామ‌ని భావించిన విద్యార్థులు ఫెయిలైపోతే... ఏదో అలా రాశామ‌న్న విద్యార్థులు మాత్రం పాసైపోయారు. వెర‌సి ఇంట‌ర్ బోర్డు వైఖ‌రి తీవ్ర వివాదాస్ప‌దంగా మారిపోయింది. బోర్డు నిర్ల‌క్ష్యం ఏ మేర ఉంద‌న్న విషయాన్ని క‌ళ్ల‌కు క‌డుతూ ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెల్ల‌డైంది. బోర్డు నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఆత్మ‌హ‌త్య  చేసుకున్న ఓ విద్యార్థినికి సంబంధించి ఒకే స‌బ్జెక్టులో మూడు ర‌కాల మార్కులేసిన బోర్డు వైనం నిజంగానే ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

ఏప్రిల్ 18న విడుదలైన ఇంట‌ర్ ఫ‌లితాల్లో అనామిక ఆరుట్ల అనే విద్యార్థినికి తెలుగులో 20 మార్కులు వ‌చ్చిన‌ట్లుగా బోర్డు ప్ర‌క‌టించింది. దీంతో తీవ్ర మాన‌సిక వేద‌న‌కు గురైన అనామిక అదే రోజు ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనిపై త‌న‌దైన శైలి పోరాటానికి దిగిన అనామిక సోద‌రి ఉద‌య‌... బోర్డు వెబ్ సైట్ లో త‌న సోద‌రికి తెలుగులో 48 మార్కులు వ‌చ్చిన విష‌యాన్ని చూసి షాక్ తిన్న‌ది. ఈ క్ర‌మంలో త‌న సోద‌రి పేప‌ర్ల‌ను రీవాల్యూయేష‌న్ చేయాల‌ని ఉద‌య డిమాండ్ చేయ‌గా... రీవాల్యుయేష‌న్ లో అనామిక‌కు కేవ‌లం 21 మార్కులు వ‌చ్చిన‌ట్లుగా బోర్డు తేల్చేసింది. అంటే... అనామిక‌ను ఇంట‌ర్ బోర్డు తెలుగు ప‌రీక్ష‌లో తొలుత ఫెయిల్ చేసి - ఆ త‌ర్వాత పాస్ చేసి... తిరిగి ఫెయిల్ చేసింద‌న్న మాట‌. ఒక స‌బ్జెక్టులో వ‌చ్చిన మార్కులు ఇలా మూడు ర‌కాలుగా ఉండ‌టం ఇంట‌ర్ బోర్డు నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌న‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News