తెలంగాణ పోలీసుల మరో సంచలనం

Update: 2019-01-06 14:30 GMT
కొత్త ఏడాది ప్రారంభంలోనే పోలీస్ శాఖ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. పోలీస్ సేవలను యాప్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన పోలీస్ శాఖ మరో ముందడుగు వేసి బాధితుల ఇంటి నుంచే సేవలందించేందుకు సిద్ధమైంది. ఇక నుంచి బాధితుల ఇంటి నుంచే ఫిర్యాదులు తీసుకోనుంది. శనివారం డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతారణంలో జరిగేలా చూసిన పోలీసులను అభినందించారు.

ఏకరూప పోలీసింగ్ విధానంతో మరింతగా ప్రజలకు సేవలందించాలని నిర్ణయించారు. 15రోజులపాటు గ్రామాలు, పల్లెలు, కాలనీలు, అపార్ట్ మెంట్లు, వ్యాపార సముదాయాలు ఇలా అన్ని ప్రాంతాల్లో సంబంధిత శాంతిభద్రతల విభాగం పోలీసులు పర్యటిస్తారు. అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి సేవలు కావాలో తెలుసుకుంటారు. సంబంధిత సమస్యలను ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తారు.

మరో అడుగు ముందుకేసి పోలీస్ శాఖ బాధితుల ఇంటి నుంచే ఫిర్యాదులను స్వీకరించనుండడంపై హర్షం వ్యక్తమవుతోంది.. అలాగే టెక్నాలజీ సహాయంతో ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేస్తారు. ప్రస్తుతానికి మహిళా సంబంధిత నేరాల్లో ఇంటికి వెళ్లి పోలీసులు ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఇదే విధంగా టీఎస్ కాప్ ద్వారా సంఘటనా స్థలంలోనే కేసులు నమోదుచేసే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది  ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఏకరూప పోలీసింగ్ విధానం విజయవంతానికి పోలీసులు పని చేయాలని డీజీపీ కోరారు.


Tags:    

Similar News