చదివింది ప్లస్ టూ.. రోజుకు రూ.5కోట్లు దోచేస్తాడు

Update: 2023-05-04 10:58 GMT
భయానికి మించిన అస్త్రం ఇంకేం ఉంటుంది. భయాన్ని ఆయుధంగా వాడేసి.. అమాయకల్ని దోచేసే ఒక సైబర్ నేరగాడి ఉదంతమిది. అతడి గురించి.. అతడు చేసే దోపిడీ గురించి తెలిస్తే.. ఇలా కూడా చేస్తారా? అన్న సందేహం కలుగుతుంది. చదివింది ప్లస్ టూ అయినప్పటికీ.. వేలాది మందిని మోసం చేసే నేర్పు.. రోజుకు రూ.5కోట్లు తక్కువ కాకుండా దోచేసే ఈ ఘరానా సైబర్ నేరగాడి వ్యవహారం పోలీసు వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు తెర తీసింది.

ఈ ఘరానా దొంగ తెలుగువాడు కావటం ఒక ఎత్తు అయితే.. ఇతడు ఉండేది హైదరాబాద్ లో. కానీ.. వీడి అతి తెలివి.. వీడి దోపిడీ స్టైల్ మీద స్టడీ చేసిన మహారాష్ట్రకు చెందిన బాంగూర్ పోలీసులు..కాపు కాచి మరీ పట్టేశారు.

ఈ ముఠాలోని మరో నలుగురిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురిలో ఇద్రు ఠాణెకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు కోల్ కతావాసులు కావటం గమనార్హం. ఈ మొత్తం దోపిడీకి మాస్టర్ మైండ్ తెలుగు ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు.

తన మోసానికి టెలిగ్రామ్ యాప్ ను వాడతాడు. తాను చేసే మోసానికి మహిళల్ని లక్ష్యంగా చేసుకుంటాడు. పోలీసు అధికారులమని ఫోన్ చేసి.. మీరు పంపిన కొరియర్ లో మాదక ద్రవ్యాలు.. ఆయుధాలు దొరికినట్లుగా బిల్డప్ ఇస్తాడు. కొరియర్ మీది కాదని నిరూపించుకోవాలంటే బ్యాంకు ఖాతా వివరాలు.. ఐటీ రిటర్నుకు సంబంధించిన వివరాల్ని పంపాలని చెబుతాడు.

వారు పంపే వివరాల్ని ఆధారంగా చేసుకొని సదరు కొరియర్ తో వారికి సంబంధం ఉందా? లేదా? అన్నది తేలుస్తామని చెబుతాడు. ఈ క్రమంలో వారి నుంచి వివరాలు సేకరిస్తూ.. ఓటీపీ పంపుతానని చెప్పి ఓటీపీ పంపుతాడు. ఎనీడెస్కు లాంటి యాప్ లను ఉపయోగించి.. వారి బ్యాంకు ఖాతాల్ని తన అధీనంలోకి తీసుకున్న అతడు.. వారి ఖాతాల్లో ఉన్న మొత్తాల్ని వేర్వేరు ఖాతాలకు మళ్లించేస్తాడు.

ఇలాంటి నేరాలకు పాల్పడి రోజుకు రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు లావాదేవీలు జరుపుతాడని చెబుతున్నారు. తాను దోచిన సొమ్ముల్ని క్రిప్టో కరెన్సీ కింద మార్చేస్తాడని పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా విచారిస్తే సంచలన విషయాలు వెలుగు చూసే వీలుందన్న మాట వినిపిస్తోంది.

Similar News