టీడీపీ లోకి ఆ వైసీపీ ఎంపీ.. నిజమేనా?

Update: 2023-06-28 21:10 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అధికారమే లక్ష్యంగా ప్రచారాన్ని ఉధృతం చేశాయి. మరోవైపు అయారాంగయారాం రాజకీయాలు ఊపందుకున్నాయి. ఒక పార్టీలో ఉన్నవారు మరొక పార్టీ లోకి జంప్‌ కావడానికి సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా వైసీపీ కంచుకోట జిల్లా అయిన నెల్లూరు జిల్లాలో పెద్దారెడ్లు ఆ పార్టీకి  షాక్‌ ఇచ్చారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కి వ్యతిరేకంగా ఓటు వేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు నెల్లూరు వైసీపీ ఎంపీ, నెల్లూరు రూరల్‌ వైసీపీ ఇంచార్జి ఆదాల ప్రభాకర రెడ్డి పార్టీ మారతారనే చర్చ ఊపందుకుంది. ఇటీవల తాను, ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి ఒక ఫంక్షన్‌ లో కలిశామని.. ఆదాల ప్రభాకర్‌ రెడ్డి టీడీపీ లో చేరిక కు మొగ్గు చూపారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి బాంబు పేల్చారు.

ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ని పార్టీలోకి వచ్చేయమని పిలిచానని సోమిరెడ్డి తెలిపారు. ఎన్నికల సమయం లో లాస్ట్‌ లో పార్టీ మారడం ఆదాలకు అలవాటేనన్నారు. నామినేషన్‌ వేయకముందో, వేసిన తర్వాతో ఆదాల వేరే పార్టీలోకి మారే అంశం పై నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేశారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండబోరన్నారు.

మరోవైపు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి వ్యాఖ్యల ను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఖండించారు. ఎన్నికలు వస్తుండటంతో టీడీపీ మైండ్‌ గేమ్‌ ఆడుతోంద ని ఆరోపించారు. ఇందులో భాగంగానే తాను పార్టీ మారుతున్నానంటూ తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభూత కల్పనలు, అవాస్తవాలు ప్రచారం చేయడం సోమిరెడ్డికే చెల్లిందని ఆదాల ప్రభాకర రెడ్డి మండిపడ్డారు.

కాగా 2019 ఎన్నికల సమయం లో టీడీపీ తరఫున నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బీఫారం తీసుకుని నామినేషన్‌ వేసే సమయంలో ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఫ్లేటు ఫిరాయించారు. వైసీపీ లోకి జంప్‌ అయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా లోని సర్వేపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర రెడ్డి విజయం సాధించారు. అంతకుముందు 1999లో ఆలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.

2019లో వైసీపీ తరఫున నెల్లూరు ఎంపీ గా ఆదాల గెలుపొందారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ని వైసీపీ బహిష్కరించడంతో నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలను ఆదాల ప్రభాకర రెడ్డికి అప్పగించింది.

కాగా వైసీపీ నుంచి బహిష్కరణ కు గురైన మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం మరింత మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీ లో చేరతారని చెబుతున్నారు. ఎన్నికల నాటికి చాలా మంది టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని స్పష్టం చేస్తున్నారు. అయితే ఆదాల ప్రభాకర రెడ్డి మాత్రం ఇది వాస్తవం కాదని తేల్చిచెబుతున్నారు.

Similar News