తప్పు సరిదిద్దుకున్న ఏపీ సర్కారు

Update: 2022-04-08 06:32 GMT
అధికారం చేతిలో ఉంది కదా అని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటవుతుందని అనుకుంటే తప్పేనని ప్రభుత్వానికి ఇపుడు తెలిసొచ్చినట్లుంది. అందుకనే కాస్త బుద్ధి కలిగి జాగ్రత్తగా వ్యవహరించింది. ఇంతకీ విషయం ఏమిటంటే తాజాగా సింహాచలం దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నియమించింది. ఈ నియామకంలో ఛైర్మన్ అశోక్ గజపతిరాజు జోలికి వెళ్ళకుండా కేవలం బోర్డు మెంబర్లను మాత్రమే నియమించింది.

 గతంలో అనువంశిక ధర్మకర్తల మండలికి ఛైర్మన్ గా ఉన్న అశోక్ స్థానంలో ప్రభుత్వం కొత్త బోర్డును నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అశోక్ కోర్టులో కేసు వేశారు. విచారణలో ప్రభుత్వ నిర్ణయం తప్పని హైకోర్టు తీర్పిచ్చింది. దాంతో ఛైర్మన్ గా అశోక్ నే ప్రభుత్వం తిరిగి నియమించాల్సొచ్చింది. అధికారం ఉందికదాని ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటానంటే కుదరదని ప్రభుత్వానికి అర్ధమైంది.

 అందుకనే అప్పటి బోర్డు కాలపరిమితి తీరిపోయన తర్వాత కొత్తగా బోర్డును నియమించింది. నిజానికి ఛైర్మన్ గా ఎవరున్నా బోర్డులో సభ్యులు మొత్తం అధికార పార్టీ నేతలనే నియమిస్తారు.

ఇపుడు  బోర్డు ఛైర్మన్ గా అశోక్ ఉన్నంత మాత్రాన ఆయన చేయగలిగేది ఏమీలేదు. ఎందుకంటే మెజారిటీ సభ్యుల ఆమోదం ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం నియమించిన సభ్యులంతా అధికార పార్టీ వాళ్ళే అయ్యుంటారు కాబట్టి ప్రభుత్వం మాటే చెల్లుబాటవుతుంది.

 దేవస్థానం ట్రస్టు బోర్టుకు ఛైర్మన్ గా టీడీపీ సీనియర్ నేత అశోక్ ఉన్నంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు. ఎందుకంటే అశోక్ మాట ఏ రకంగా కూడా చెల్లుబాటుకాదు. ఇంతచిన్న విషయాన్ని మరచిపోయి ఉన్నపళంగా ఛైర్మన్ గా అశోక్ ను తొలగించేసి మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం ఒకపుడు కంపు చేసుకున్నది.

కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ఇపుడు జ్ఞానోదయం అయినట్లుంది. అందుకనే చైర్మన్ ను ముట్టుకోకుండా కొత్త పాలకవర్గాన్ని నియమించింది. దీంతో ఛైర్మన్ గా అశోక్ ఉన్నా ప్రభుత్వానికి పెద్దగా కలిగే ఇబ్బంది లేదు.
Tags:    

Similar News