ఏపీలో పాత జోన్లతోనే కొత్త జిల్లాలు?

Update: 2020-11-18 02:30 GMT
ఏపీలో నిర్దిష్టమైన అభివృద్ధి పనులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించిన సంగతి తెలిసిందే. దీంతో, ఏపీలో జిల్లాల విభజనపై కూడా నిమ్మగడ్డ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త జిల్లాల ప్రతిపాదనకు బ్రేక్ వేయాలంటూ ఏపీ సీఎస్ నీలం సాహ్నికి నిమ్మగడ్డ లేఖ రాశారు. మరోవైపు, జనవరి 2021 నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై జగన్ సర్కార్ సైలెంట్ గా కీలక సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాల ప్రకటన వచ్చిన 2 వారాల్లోగా ఏ జిల్లా సిబ్బంది ఆ జిల్లాలో సర్దుబాటు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ట్రెజరీ ద్వారా సంబంధిత అధికారులు, ఉద్యోగుల సీనియారిటీ తదితర కీలక సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు, పాత జోన్లలోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.

కొత్త జిల్లాల్లో పరిపాలనకు తగ్గుట్టుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని సర్దుబాటు చేసేలా జగన్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోందట. సీనియారిటీ ప్రకారం ఐఏఎస్‌లను కలెక్టర్లుగా ప్రమోట్ చేయనున్నారట. ప్రతీ జిల్లాకు ముగ్గురు జేసీలు ఉండబోతున్నారని, వారిలో ఇద్దరు ఐఏఎస్‌లు.. మరొకరు నాన్ ఐఏఎస్ కేడర్ అధికారి ఉండబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొత్త జిల్లాల కోసం కొత్త జోన్ల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం కావాల్సి ఉంది. అందుకే, ప్రస్తుతం ఉన్న 4 జోన్ల పరిధిలోనే కొత్త జిల్లాలను చేర్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఓ పక్క నిమ్మగడ్డ అనుమతి లేకెుండా జిల్లాల పెంపు సాధ్యం కాదు...అయినా జగన్ ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో జనవరిలోపు జిల్లాల విభజన జరుగుతుందా? నిమ్మగడ్డ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News