ర‌ఘురామ పిటిష‌న్ ను కొట్టేసిన‌ హైకోర్టు.. కార‌ణ‌మిదే..!

Update: 2022-07-01 09:30 GMT
వైఎస్సార్సీపీ న‌ర‌సార‌పురం రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు, జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార్ కొన‌సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఎంపీగా గెలిచిన ర‌ఘురామ ఆ త‌ర్వాత పొడ‌సూపిన విభేదాల‌తో వైఎస్సార్సీపీకి దూర‌మ‌య్యారు. అప్ప‌టి నుంచి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు వైఎస్సార్సీపీ నేత‌ల నుంచి అంతే ధీటుగా ర‌ఘురామ‌పై కౌంట‌ర్లు ప‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చుకునేందుకు జ‌గ‌న్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ రఘురామకృష్ణరాజు దాఖ‌లు చేసిన‌ పిల్ ను హైకోర్టు కొట్టేసింది. దీనిని కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రతిని తాజాగా అందుబాటులో ఉంచింది.

రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే రఘురామకృష్ణరాజు ఈ పిల్ దాఖలు చేశారని హైకోర్టు తేల్చింది. పేదలు, అణగారిన వర్గాల కోసం ఈ వ్యాజ్యం దాఖలు చేయలేదని తెలిపింది. ఆయన ఉద్దేశం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంద‌ని స్ప‌ష్టం చేస్తూ ఆ పిల్ ను కొట్టివేసింది.

ఈ సంద‌ర్భంగా హైకోర్టు.. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరించింది. కేవలం అకడమిక్‌ ప్రయోజనం కోసం దాఖలు చేసే వ్యాజ్యాలను న్యాయస్థానాలు విచారించబోవని తెలిపింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పిల్‌ల ద్వారా లేవనెత్తినప్పుడు వాటిని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోబోవ‌ని తెలిపింది. రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వం లేదా దాని కార్పొరేషన్‌లను అడ్డుకుంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ధర్మాసనం తెలిపింది.

ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగించే వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే విషయంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తాయ‌ని మాత్ర‌మే తెలిపింది. అలాంటి వ్యవహారాల నిర్వహణను ప్రభుత్వానికి వదిలేయాలని సూచించింది. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించేందుకు న్యాయస్థానాలేమీ ఆర్థికవేత్తలో, ఆర్థిక నిపుణులో కాదని హైకోర్టు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

రుణం పొందేందుకు ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు అనుమతినిస్తే రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ఆర్థిక ముప్పును కలిగిస్తుందని ర‌ఘురామ త‌న పిటిష‌న్ లో పేర్కొన్నార‌ని కోర్టు తెలిపింది. అయితే అది ఏ విధంగా ఆర్థిక ముప్పో చెప్పేందుకు ఆయ‌న‌ ఎలాంటి వివరాలను కోర్టు ముందుంచలేదని హైకోర్టు ఆక్షేపించింది. కేవలం రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనను మాత్రమే ప్రశ్నించారని, దీనికీ, పేదల ప్రజల సంక్షేమానికి ఎలాంటి సంబంధం లేదని స్ప‌ష్టం చేసింది.
Tags:    

Similar News