ఏపీ సర్కారుకు షాకిచ్చిన హైకోర్టు.. ఈసారి మరింత ఘాటుగా!

Update: 2020-12-11 13:03 GMT
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటానికి వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్న విషయమై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆస్తులను అమ్మి సంక్షేమపథకాలు, నగదుబదిలీ పథకాలను అమలు చేస్తుండటంపై కొంతమంది కోర్టులో కేసులు వేశారు. ఈ కేసులపై ఈరోజు విచారణ జరిగింది. ఇరువైపుల లాయర్ల వాదనలు వినిపిస్తున్న సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సంక్షేమపథకాలు అమలు చేయటమా అంటూ న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారట. దేశంలో ఏమైనా ఆర్ధిక ఎమర్జెన్సీ ఉందా అంటూ ఆశ్చర్యపోయారట. పథకాల అమలుకు ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన అగత్యంలో ప్రభుత్వం ఉందా అంటూ విస్మయం వ్యక్తంచేశారు.

ప్రభుత్వ లాయర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనన్ని సంక్షేమపథకాలను ఏపిలో అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇదే సమయంలో తుపాను షెల్టర్లను కూడా అమ్మకానికి పెడుతున్న విషయం కోర్టు దృష్టికి వచ్చింది. కోర్టులో దాఖలైన అన్నీ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించారు.

పనిలో పనిగా మద్య ఆదాయంపైన జరిగిన చర్చలో నిజంగా మద్యం ఆదాయమే లేకపోతే రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి ఏమైపోయేదో అంటు న్యాయమూర్తి ఎద్దేవా చేశారు. సంక్షేమపథకాల అమలులో నిజంగా మద్యం ప్రియులే ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నారంటూ ఎగతాళి చేశారు. చివరకు కరోనా వైరస్ కాలంలో కూడా మద్యం ప్రియులు అధిక ధరలు పెట్టి మరీ మద్యం కొనుగోలు చేయటాన్ని న్యాయమూర్తి గుర్తుచేశారు.
Tags:    

Similar News