ఆ మంత్రి మాటలు కేసీఆర్ వింటే ఎన్ని తిట్లు తిడతారో?

Update: 2021-06-26 03:37 GMT
ఊరుకోండయ్య.. ఉత్తినే భయపెట్టేస్తారు. కరోనా ఏందయ్య? మాటలతోనే చంపేస్తున్నారే.. మీ పుణ్యమా అని జనాలు ఆగమాగం అవుతున్నారంటూ ఈ మధ్యన కరోనా మీద క్లాస్ పీకిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు బాగానే గుర్తుండి ఉంటాయి. ఒక పిట్టకథ చెప్పి మరీ మీడియాను.. సోషల్ మీడియాను ఒక రౌండ్ వేసుకున్న ఆయన మహమ్మారిని చాలా సింఫుల్ గా తేల్చేశారు.

ఎవరి దాకానో ఎందుకు? నా సంగతే తీసుకోండి.. కరోనా వస్తే రెండంటే రెండు గోలీలు వేసుకున్నా.. ఒకటి డోలో.. రెండోది యాంటీ బయాటిక్.. మూడో గోలీ (డి విటమిన్) వేసుకోమన్నారు కానీ వేసుకోలేదంటూ కరోనా నుంచి తాను తీసుకున్న వైద్యం గురించి సింపుల్ గా తేల్చేశారు. అంత ఈజీగా అయిపోయే వైద్యానికి ఎందుకింత రాద్దాంతం అంటూ మండిపడ్డారు. ఎప్పటిలానే తన మాటలతో  తీవ్రమైన కరోనా చాలా సింఫుల్ అన్న భావన కలిగేలా చేశారు.

కేసీఆర్ మాటలు విన్నంతనే కొండంత ధీమా కలుగుతుంది కానీ.. వాస్తవానికి కొవిడ్ అంత తేలికైనది కాదు. అదే అయితే.. తెలంగాణను వదిలేయండి.. యావత్ ప్రపంచం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తాజాగా మహారాష్ట్ర మంత్రి ఒకరు చెప్పిన మాట వింటే థర్డ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా ఆయన మాటలు ఉన్నాయి.

మహారాష్ట్ర పుడ్ అండ్ డ్రగ్ ఆడ్మినిస్ట్రేషన్ మంత్రి రాజేంద్ర షింగ్నే మీడియాతో మాట్లాడుతూ మూడో వేవ్ లో ఐదు లక్షల మంది చిన్న పిల్లలతో సహా యాభై లక్షల మందికి కరోనా సోకుతుందని చెప్పారు. గరిష్ఠ స్థాయిలో ఎనిమిది లక్షల యాక్టివ్ కేసులు ఉంటాయని చెప్పారు. సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తానీ అంశాల్ని చర్చించినట్లుగా పేర్కొన్నారు. ఆరోగ్య.. మౌలిక సదుపాయాల్ని పెంచటం.. తగిన మందుల్ని సమకూర్చుకోవటంతో పాటు శిశువైద్యులతో సహా మెడికల్ కేర్ సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పారు.

మహారాష్ట్ర మంత్రి థర్డ్ వేవ్ మీద అంత అప్రమత్తంగా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కొవిడ్ వైద్యం అంత సింఫుల్ అంటూ తేల్చేస్తుండటం గమనార్హం. మీడియాకు పంచ్ లు వేయటం కేసీఆర్ కు కొత్తేం కాదు. కానీ.. ఒక రాష్ట్రానికి చెందిన మంత్రి నోటి నుంచి వచ్చిన ఈ మాటల్ని వింటే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో?
Tags:    

Similar News