డ్రగ్స్ కేసులో పేరు వచ్చిందంటే.. పొలిటికల్ కెరీర్ ముగిసినట్లే

Update: 2021-04-06 14:30 GMT
కర్ణాటకలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు తీగ లాగితే.. తెలంగాణలో డొంక కదలటం.. టాలీవుడ్ నటులతో పాటు తెలంగాణలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముగ్గురు కాదు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఇంతకీ.. ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారు? అన్నది మరో ప్రశ్న. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై తెలంగాణ అధికారపక్షంలో హాట్ చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు వినిపిస్తున్న పేర్లలన్ని ఉమ్మడి రంగారెడ్డి.. మహబూబ్ నగర్.. నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారేనంటూ ప్రచారం సాగుతోంది. అందులో తెలంగాణ అధికారపక్షానికి చెందిన నేతలన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటివరకు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. అయితే.. తాజాగా నడుస్తున్న చర్చతో పాటు.. చోటు చేసుకుంటున్న పరిణామాలపై తెలంగాణ అధినాయకత్వం సీరియస్ గా చూస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఒకవేళ.. డ్రగ్స్ కేసులో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్లుగా కర్ణాటక పోలీసులు ప్రకటిస్తే ఏం చేయాలన్న దానిపైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకు వేచి చూసే ధోరణి అనుసరించాలని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. ఒక్కసారి వివరాలు బయటకు వచ్చి.. అందుకు సంబంధించిన సమాచారం వెల్లడైతే.. అలాంటి నేతలు ఎవరైనా.. వారెంత శక్తివంతమైనప్పటికి వారిపై బహిష్కరణ వేటు వేసేందుకు టీఆర్ఎస్ నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్లు తేలితే.. వారి రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనన్న మాట వారి నోటి నుంచి రావటం గమనార్హం. ఆధారాలు లభిస్తే.. చర్యలు వెంటనే తీసుకుంటారని.. ఏ మాత్రం ఆలస్యం చేయరని చెబుతున్నారు. తొలుత బహిష్కరణ వేటు వేస్తారని.. ఆ తర్వాత రాజకీయ జీవితం ముగిసినట్లేనన్న మాట టీఆర్ఎస్ కీలక నేతల సంభాషణల్లో రావటం గమనార్హం.




Tags:    

Similar News