హరీశ్ ను హుజూరాబాద్ నుంచి పంపించేయాలట

Update: 2021-10-17 12:53 GMT
రసవత్తరంగా సాగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి కీలక వ్యాఖ్య చేశారు. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరుగుతుందన్న ఆందోళనవ్యక్తం చేశారు. మంత్రి హరీశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. హరీశ్ మీద తాజాగా ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ కు కంప్లైంట్ చేశారు.

మంత్రి హోదాలో ఉన్న హరీశ్ ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని.. ఆయన్ను నియోజకవర్గం నుంచి వెంటనే తప్పించాలని.. ఆయన్ను ప్రచారానికి అనుమతించకూడదని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గడిచిన నెల రోజులుగా నియోజకవర్గంలో ఉన్న మంత్రి హరీశ్  తనకున్న అధికారంలో ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లుగా ఆయన మండిపడుతున్నారు.

సీనియర్ కాంగ్రెస్ నేత చెప్పినట్లే.. హుజూరాబాద్ ను తన వ్యక్తిగత అంశంగా హరీశ్ రావు తీసుకోవటం తెలిసిందే. మొదట్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ఉప ఎన్నిక మీద అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ.. తర్వాతి కాలంలో మొత్తం బాద్యతను హరీశ్ కు అప్పజెప్పి.. ఆయన సైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరంగా మంత్రి కేటీఆర్ ను కూడా ఉప పోరులో వేలు పెట్టొద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. హుజూరాబాద్ మీద కేటీఆర్ నోటి నుంచి ఎలాంటి వ్యాఖ్య రావటం లేదంటున్నారు.

అన్నీ తానై నడిపిస్తున్న హుజూరాబాద్ లో ఫలితం ఏ మాత్రం తేడా కొట్టినా దానికి పూర్తి బాధ్యత హరీశ్ ను చేస్తారని చెబుతున్నారు.  అన్ని ఆలోచించిన తర్వాతే హరీశ్ కు హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యత అప్పజెప్పారని అంటున్నారు. దీంతో.. ఉప పోరును సీరియస్ గా తీసుకున్న హరీశ్ తన సర్వశక్తుల్ని ఒడ్డుతున్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఆయన ఆశించినట్లుగా తుది ఫలితం ఉంటుందా? అన్నది ఒక ప్రశ్న అయితే.. సీనియర్ కాంగ్రెస్ నేత ఇచ్చిన తాజా ఫిర్యాదుపై ఎన్నికల సంఘం అధికారి ఎలాంటి చర్య తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కమలనాథులు ఊరుకుంటారా? మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News