తెలంగాణలో టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్.. బీజేపీ ఖతమే

Update: 2019-10-24 08:09 GMT
ఆర్టీసీ సమ్మె, ఆర్థిక ఒడిదుడుకులు, రాష్ట్రంలో బీజేపీ దూకుడు చూసి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పని అయిపోయిందని అంతా భావించారు. హుజూర్ నగర్ లో కేసీఆర్ ప్రచారం చేయకపోవడం.. కేటీఆర్ దూరంగా ఉండడంతో గులాబీ బాస్ కు భారీ బొక్కపడుతుందని అంతా అనుకున్నారు..

మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈసీ ప్రత్యేకాధికారి బాలక్రిష్ణన్ టీఆర్ఎస్ అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశారు. బీజేపీ గెలుస్తుందని ఆశలేకపోయినా అక్కడ ఎస్పీని మార్చి, శాంతి భద్రతలు చేతుల్లోకి తీసుకొని టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఆయువుపట్టుపై కొట్టింది.

అయితే ఫలితాలు మాత్రం టీఆర్ఎస్ కు ఏకపక్షంగా వస్తున్నాయి. హుజూర్ నగర్ గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం 1 గంట వరకు అందుతున్న సమాచారం ప్రకారం హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి 21 వ రౌండ్ వరకు 26వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకో 9 రౌండ్లు ఉన్నాయి. దీంతో ఈ కాంగ్రెస్ సీటును టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

హుజూర్ నగర్ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి ఇక్కడ వేరే పార్టీ గెలిచింది లేదు. కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. అక్కడ పీసీసీ చీఫ్ ఉత్తమ్ హుజూర్ నగర్ ను కాంగ్రెస్ కంచుకోటగా మలిచారు. అంతటి కీలకమైన కాంగ్రెస్ అధ్యక్షుడి సీటును కొల్లగొట్టడం అంటే మాటలు కాదు.. కానీ కేసీఆర్ చేసి చూపించారు. గులాబీ పార్టీ కాంగ్రెస్ నే కాదు.. తెలంగాణపై ఆశలు పెంచుకున్న బీజేపీ ఆశలను కూడా ఆడియాసలు చేసింది.

బీజేపీకి హుజూర్ నగర్ పీడకలను మిగిల్చింది.. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ మొదటి స్థానంలో .. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా.. స్వతంత్ర హెల్మెట్ గుర్తు అభ్యర్థి మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీ 4వ స్థానానికి పడిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉండి మొన్నటి ఎంపీ ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీకి ఇంతకంటే ఘోర అవమానం లేదని టీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి.విశేషం ఏంటంటే కాంగ్రెస్ కు కంచుకోటలైన  మట్టపల్లి, నేరేడు జర్ల మండలాల్లోనూ టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది.

దీన్ని బట్టి తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ మాత్రమేనని ఓటర్లు స్పష్టమైన తీర్పునిచ్చారు. కేంద్రం వరకే బీజేపీ పరిమితం అని తేల్చిచెప్పారు.  అయితే హుజూర్ నగర్ ఫలితం చూసి తెలంగాణపై ఆపరేషన్ మొదలుపెట్టాలని భావించిన బీజేపీ ఇప్పుడు ఫలితాలతో షాక్ తిన్నది. మరి కమలదళం ఎలా ముందుకెళ్తుందన్నది వేచిచూడాలి.

హుజూర్ నగర్ విజయంతో కేసీఆర్ బయటకు వస్తున్నారు. ఈసాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఫలితాలపై స్పందిస్తారు. ఆయన కాంగ్రెస్, బీజేపీలకు ఎలాంటి హెచ్చరికలు పంపుతారనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News