పార్టీ మార్పుపై స్పందించిన తుమ్మల

Update: 2022-11-11 10:41 GMT
మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారుతారనే ఊహాగానాలు మరోసారి వచ్చాయి. ఆయన టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్నారని.. బీజేపీలో చేరే అవకాశముందని తెలంగాణ పాలిటిక్స్ లో ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు అనుచరులతో తుమ్మల ఆత్మీయ సమావేశం నిర్వహించడం సంచలనమైంది.

టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించడంతో పార్టీ మారతారనే ప్రచారం బయటకొచ్చింది. పార్టీ మార్పుపై చర్చించేందుకే ఈ కీలక సమావేశం నిర్వహించారనే వాదన ఉంది.  ములుగు జిల్లా వాజేడులో తన అభిమానులతో తుమ్మల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం పార్టీ మార్పుకేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గురువారం ఉదయం భద్రాద్రి రామాలయం లో పూజలు చేసిన తుమ్మల దాదాపు 350 కార్లతో ర్యాలీగా వాజేడుకు వెళ్లారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అనుచరులతో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈక్రమంలోనే మరోసారి తుమ్మల పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ తొలి ప్రభుత్వంలో పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చి.. ఎమ్మెల్సీని చేసి తుమ్మల నాగేశ్వరరావును గౌరవించారు కేసీఆర్. అయితే ఖమ్మం జిల్లాలో రెండో దఫా ఎన్నికల్లో అసమ్మతి, అనైఖ్యతతో టీఆర్ఎస్ కేవలం ఒక ఎమ్మెల్యే సీటునే గెలిచింది. దీంతో తుమ్మలను పక్కనపెట్టి గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యేనే మంత్రిని చేసి ఖమ్మం రాజకీయాలకు దూరం పెట్టాడు కేసీఆర్.

అప్పటి నుంచి అలకబూనిన తుమ్మల నాగేశ్వరరావు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఆయన పార్టీ మారేందుకు యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే పలు మార్లు ట్రై చేసినా ఆగిపోయిన తుమ్మల తాజాగా 'ఆత్మీయ సమ్మేళనం' పేరిట ఒక కొత్త సమావేశానికి పూనుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక పార్టీ మార్పు ఊహాగానాలపై తుమ్మల స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నాన్న వార్తల్లో నిజం లేదని.. చివరివరకూ తన మిత్రుడైన సీఎం కేసీఆర్ వెంటే నడుస్తానంటూ చెప్పుకొచ్చాడు. కేసీఆర్ తోనే తన రాజకీయ జీవితం ముడిపడి ఉందని.. జీవితాంతం కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. అభిమానులు తోడుగా ఉంటే ఏదైనా సాధిస్తానంటూ తుమ్మల తెలిపారు. 40 ఏళ్లుగా నీతి, నిజాయితీలతో రాజకీయాలు చేశానని.. భవిష్యత్తులోనూ అలాగే ఉంటానని తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News