ఆంధ్రప్రదేశ్‌ లో డేంజర్ బెల్స్: తాజాగా 461 కేసులు

Update: 2020-06-19 10:10 GMT
వైరస్ ఆంధ్రప్రదేశ్ లో కల్లోలం సృష్టిస్తోంది. వైరస్ తో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.శుక్రవారం ఒక్కరోజే 461 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏకంగా నలుగురు మృతి చెందారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసుల్లో రాష్ట్రానికి చెందిన వారు 376 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 70 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 19 మంది ఉన్నారు.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 17,609 మంది శాంపిల్స్ పరీక్షించారు. వీరిలో 376 మందికి పాజిటివ్‌ తేలింది. 82 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 6,134 కేసులు నమోదు కాగా, 3,065 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ కోవిడ్‌ ఆస్పత్రుల్లో 3,069 మంది చికిత్స పొందుతున్నారు.

వైరస్ కారణంగా ఒక్కరోజే నలుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, శ్రీకాకుళం ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 96కు పెరిగింది. అలాగే పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 7,865 కేసులు నమోదయ్యాయి.
Tags:    

Similar News