దీక్షకి రంగం సిద్ధం చేసిన వైజాగ్ మేయర్ ?

Update: 2021-07-29 07:51 GMT
విశాఖపట్నం మేయర్ గా పదవీ బాధ్యతలు చేపట్టి కొద్ది నెలలే గడిచాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం పాలన కొనసాగిస్తుంది. ఈ సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి చెందిన మేయర్ ఆందోళన చేపట్టడం అనేది సాధారణంగా ఎక్కడా అసలు జరగదు. హాయిగా తన పదవీకాలాన్ని ప్రజాసేవలో పూర్తి చేయాల్సిన మేయర్ వీధుల్లోకి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట. విశాఖ మేయర్ హరి వెంకట కుమారి దీక్షకు రెడీ అవుతున్నారు. ఆమె ఒక్కరే కాదు, జీవీఎంసీలో ఉన్న వైసీపీ కార్పోరేటర్లు అంతా ఒక రోజు దీక్ష చేస్తున్నారు.

అందరూ కూడా అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారే కదా, మరి వారు ఎందుకు దీక్షకి దిగుతున్నారు అనే అనుమానం రాకమానదు. అయితే, వారంతా చేపట్టబోయే ఈ ఆందోళన వెనక ధర్మాగ్రహం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం అడ్డగోలుగా ప్రైవేట్ పరం చేస్తోంది. దాంతో పాటుగా దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఎక్కడా వెనక్కు తగ్గడంలేదు. తాజాగా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లోనూ ప్రైవేట్ పరం చేయడం తప్పదు అని మరోసారి స్పష్టం చేసింది. కేంద్రం తరపున కార్యదర్శి ఆర్కే సింగ్ ఈ మేరకు దాఖలు చేశారు. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే.. స్టీల్ ప్లాంట్‌ లో పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతున్నట్లు అఫిడవిట్‌ లో పేర్కొంది కేంద్రం.

దీనిపై ఈ ఏడాది జనవరి 27నే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం హైకోర్టుకు చెప్పింది. హైకోర్టు లో వేసిన పిటీషన్ రాజకీయ దురుద్దేశంతో వేశారంటూ కేంద్రం అభిప్రాయపడింది. ఉద్యోగులు ప్లాంటు అమ్మవద్దనడం సరికాదు, 100 శాతం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాలు జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్ విషయంలో జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిటీషన్ విచారణకు అర్హత లేనిదని అభిప్రాయపడింది కేంద్రం.దేశ ఆర్థిక వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుందని, ఇటువంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని ఆర్కే సింగ్ అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఇటువంటి విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉందని చెప్పారు. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని అఫిడవిట్‌లో కోరింది కేంద్రం.

దీంతో విశాఖలో ప్రజా ప్రతినిధులు ఇపుడు రంగంలోకి దిగుతున్నారు. అయిదు నెలల క్రితం జనం ఓట్లతో గెలిచిన కార్పోరేటర్లు అంతా కూడా ఇపుడు స్టీల్ పోరులో ముందుకు వస్తున్నారు.మేయర్ వెంకటకుమారి నాయకత్వంలో అంతా దీక్ష చేయడం ద్వారా కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గట్టిగా కోరనున్నారు. ఆగస్ట్ 2న మేయర్ నాయకత్వాన ఈ దీక్ష జరుగుతోంది. అదే సమయంలో ఢిల్లీ వీధులలో జంతర్ మంతర్ వద్ద ఉక్కు కార్మిక సంఘాలు కూడా అతి పెద్ద ఆందోళన చేపట్టనున్నారు. ఇది ఒక బృహత్తర ప్రయత్నమని, దీని తరువాత తుది పోరుకు కూడా తాము రెడీ అవుతామని ఉక్కు కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే కధ క్లైమాక్స్ కి చేరుతున్నట్లే అనుకొవాలి. అయితే , కేంద్రం మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ప్రైవేటీకరణ ఆగదు అంటూ చెప్తుంది.


Tags:    

Similar News