పెద్దాయన అంటే ఆయనే : పులివెందుల టికెట్ కోసం వైఎస్సార్ ఏం చేశారంటే...?

Update: 2022-07-08 09:39 GMT
వైఎస్సార్. ఈ మూడు అక్షరాలు తెలుగు జనాలకు ఎంతో ఇష్టమైనవి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఏపీ జనం మెచ్చిన ముఖ్యమంత్రి. ఆయన సీఎం కావడానికి సుదీర్ఘమైన నిరీక్షణ చేశారు. అన్ని అర్హతలు ఉండి కూడా ముఖ్యమంత్రి యోగం లేదా అని ఆయన కాదు కానీ సన్నిహితులు బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వైఎస్సార్ చాలా చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. గట్టిగా ముప్పయి నిండకుండానే ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. మూడున్నర పదుల వయసులో ఏకంగా ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు.

అవతల పక్కన ఉన్నది సినీ గ్లామర్ నిండా నింపుకుని దేవుడిగా జనం గుండెల్లో ఉన్న ఎన్టీయార్. బంపర్ మెజారిటీతో 1983లో ఎన్టీయార్ అధికారంలోకి వచ్చాక ఆయనను ఢీ కొట్టే బాధ్యత‌ను వైఎస్సార్ కి అప్పచెప్పారు. అలా పార్టీని యువ కెరటంగా దూసుకువచ్చి ముందుకు నడిపించారు వైఎస్సార్ ఎన్టీయార్ తో ఢీ అంటే ఢీ అన్నారు. ఒకసారి ఎన్టీయార్ ని ఏకంగా సచివాలయానికి రాకుండా భారీ నిరసన చేపట్టి అడ్డుకోవడం ద్వారా వైఎస్సార్ బాగా  హైలెట్ అయ్యారు.

ఆయన రాయలసీమ నీటి సమస్యల మీద పాదయాత్ర చేశారు. నాటి టీడీపీ సర్కార్ కి సీమ డిమాండ్లను వినిపించి వాటి పరిష్కారం కోసం పట్టుబట్టేవారు. అలా కొన్నేళ్ల పాటు పీసీసీ చీఫ్ గా ఆయన వ్యవహరించారు. అయితే 1985 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ గెలవడంతో వైఎస్సార్ పీసీసీ చీఫ్ నుంచి తప్పుకున్నారు. ఆ మీదట ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూనే దూకుడు చేశారు. ఇక కాంగ్రెస్ లో యంగ్ టర్క్ గా ఎదుగుతున్న వైఎస్సార్ ని ఏపీలో ఉంచకుండా ఢిల్లీ బాట పట్టించడానికి సొంత పార్టీలోనే ఆయన వ్యతిరేక వర్గం ప్రయత్నం చేసింది. దాని ఫలితమే పదేళ్ల పాటు కేవలం ఎంపీగానే ఢిల్లీకే వైఎస్సార్ పరిమితం అయ్యారు.

ఇక కేంద్ర మంత్రిగా ఆయన పేరు పలుమార్లు పరిశీలన‌కు వచ్చినా కాకపోవడానికి కారణం కూడా సొంత పార్టీలో ప్రత్యర్ధులు అని చెబుతారు. అలా 1998 దాకా వైఎస్సార్ కేంద్ర రాజకీయాలకే పరిమితం అయ్యారు. 1998లో ఆయన పీసీసీ చీఫ్ అయ్యారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ రధ చక్రాన్ని స్పీడ్ గా తోలి గెలుపు దాకా పార్టీని తెచ్చారు. అయినా టీడీపీవే అప్పట్లో గెలిచింది. ఇక 2003లో మండే ఎండలో పాదయాత్ర చేయడం ద్వారా కాంగ్రెస్ జోరుని ఎవరూ ఆపలేరు అన్న భావనను కలిగించారు. ఫలితమే 2004లో కాంగ్రెస్ ఘనవిజయం. అలా 21 ఏళ్ల పాటు అధికార రాజకీయాలకు దూరమైన వైఎస్సార్ ముఖ్యమంత్రిగానే తిరిగి అధికార హోదాలో దర్శనం ఇచ్చారు.

అయిదేళ్ళ పాలనలో ఆయన అనేక మంచి పనులు చేశారు. ముఖ్యంగా సంక్షేమానికి పెద్ద పీట వేశారు. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేశారు. ఒక విధంగా బడుగులకు పేదలకు అండగా వైఎస్సార్ పాలన సాగింది. దాని ఫలితమే 2009లో మరోసారి కాంగ్రెస్ ఘన విజయం. నిజంగా ఆయన బతికి ఉంటే ఆ అయిదేళ్ళ పాలన ఎలా ఉండేదో. మరెన్ని అద్భుతాలు సృష్టించేదో కానీ ఇలా సీఎం అయిన మూడు నెలలకే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ దుర్మరణం పాలు అయ్యారు.

ఇక వైఎస్సార్ పాలించింది అయిదుంపావు ఏళ్ళు అయినా జనం గుండెల్లో నిలిచిపోయారు. వైఎస్సార్ ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో పులివెందులను కోటగా మార్చుకున్నారు. కడప నుంచి ఎంపీగా గెలిచారు. అయితే దానికి ముందు 1978లో ఫస్ట్ టైమ్ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మాత్రం టికెట్ కోసం నానా ఇబ్బందులు పడ్డారని చెబుతారు. ఆయన రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అయితే పులివెందుల టికెట్ అప్పటికే వేరే వారికి కేటాయించారు. ఆయన సీనియర్ నేత కూడా.

దాంతో యువకుడు అయిన వైఎస్సార్ కి టికెట్ ఇవ్వడానికి రెడ్డి కాంగ్రెస్ వారు పెద్దగా ఆసక్తి చూపలేదు. పైగా ఇస్తే గెలిచి వస్తారన్న నమ్మకం కూడా వారికి లేదు అని చెబుతారు. అయితే వైఎస్సార్ పట్టుదల మీద ప్రయత్నం చేసి పెద్దలను ఒప్పించి టికెట్ సాధించారు. ఈ సందర్భంగా ఆయన వారికి ఇచ్చిన మాట ఒక్కటేనట. నేను ఎమ్మెల్యేగా  గెలిచి వస్తాను అని. ఇక వైఎస్సార్ మొదటి ఎన్నిక కోసం ఆ రోజులలో ఖర్చు చేసింది అక్షరాలా లక్ష రూపాయలు. అంటే ఈ రోజుల లెక్కల్లో చాలా ఎక్కువే మరి.

ఇక వైఎస్సార్ కి మంచి దోస్త్ చంద్రబాబు అంటే చాలా మందికి నమ్మకం ఉండదు. కానీ ఇద్దరూ మంచి మిత్రులు. ఇద్దరూ పక్క పక్క జిల్లాల వారు. ఇద్దరూ హైదరాబాద్ లో ఒకే రూమ్ లో ఉండేవారు. ఇద్దరూ మంత్రి పదవుల కోసం ట్రై చేసి ఒకేసారి చాన్స్ కొట్టేసారు. ఈ బంధం 1983లో చంద్రబాబు టీడీపీలో వెళ్ళేంతవరకూ సాగింది.

ఆ తరువాత కూడా రాజకీయాలు ఎలా ఉన్నా కూడా చంద్రబాబుతో తన స్నేహాన్ని వైఎస్సార్ కొనసాగించారు. ఆయన మంచి స్నేహశీలి అని చెబుతారు. వైఎస్సార్ జీవితంలో స్నేహానికే ఎపుడూ పెద్ద పీట. రాజకీయం అన్నది ఆయనకు ఊపిరి కానే కాదు. ఇక వైఎస్సార్ కి ఇష్టమైన తెలుగు సినిమా కధానాయకుడు ఎన్టీయార్ అని కూడా చెబుతారు. ఆయన తీరిక వేళలలో ఇంగ్లీష్ నవలలను ఎక్కువగా చదివేవారు. ఇంట్లో అసలు రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడేవారు కాదని చెబుతారు.

ఇక తన స్నేహితులు అయినా తెలిసినవారు అయినా కష్టాల్లో ఉంటే తక్షణం ఆదుకునే గుణం వైఎస్సార్ ది అని ఆయన సన్నిహితులు చెబుతారు. వైఎస్సారి కి ఉన్న సరదా బైక్స్ బాగా స్పీడ్ గా నడపడం. ఆ రోజుల్లో రాయల్ ఎన్ ఫీల్డ్ ఆయన బాగా డ్రైవ్ చేసేవారు. అలాగే జీప్ డ్రైవింగ్ కూడా ఆయనకు బాగా ఇష్టం. ఇక చెరగని చిరునవ్వే ఆయన బలం. అందే ఆయనకు అసలైన అందం. జనంతో చిరకాలం పెనవేసిన బంధం.
Tags:    

Similar News