సినీ గ్లామర్ ఎక్కడ.... వైసీపీ లో కలరింగ్ ఏదీ....?

Update: 2022-09-10 06:42 GMT
వైసీపీకి సినీ గ్లామర్ లేని పరిస్థితి ఎదురవుతోంది. పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా వైసీపీకి పెద్దగా టాలీవుడ్ నుంచి సపోర్ట్ లేదు. వెటరన్ యాక్టర్ విజయచందర్ వంటి వారు తప్ప. అయితే 2019 నాటికి మాత్రం పరిస్థితి మారింది. చాలా మంది సినీ నటులు వైసీపీ వైపు చూశారు. వారిలో సీనియర్ హీరో మోహన్ బాబు, సీనియర్ హీరోయిన్ జయసుధ, జీవిత రాజశేఖర్,  భానుచందర్, డైరెక్టర్ క్రిష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డితో పాటు స్టార్ కమెడియన్ అలీ, నటులు క్రిష్ణుడు, తనీష్, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ రాజ్, కమెడియన్ కమ్  డైలాగ్ రైటర్ పోసాని క్రిష్ణ మురళి వంటి వారు వైసీపీ కండువా కప్పుకున్నారు.

వీరంతా తమకు తోచిన విధంగా వైసీపీకి ప్రచారం కూడా చేసి పెట్టారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమకు మద్దతుగా ఉన్న సినీ నటులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు మోహన్ బాబు రాజ్యసభ సీటు కోరుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ అది దక్కలేదు. అలాగే అలీ ఎమ్మెల్సీ అయినా లేక నామినేటెడ్ పదవి ఏదైనా ఆశించారు అని కూడా ప్రచారం సాగింది. ఆయనకూ ఏ చాన్స్ లభించలేదు.

ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గా ఉన్న పృధ్వీరాజ్ కి అయితే ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పదవి వచ్చినా అది మూడు నాళ్ళ ముచ్చటే అయింది. దాంతో ఆయన ఆ పదవిని పోగొట్టుకున్నారు. తనకు వైసీపీ వారే మోసం చేసి బయటకు నెట్టారని ఆయన ఆరోపించారు కూడా. ఇపుడు ఆయన జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.

మిగిలిన వారిని తీసుకుంటే మోహన్ బాబు వైసీపీకి దూరం అయ్యారు. ఆయన ఈ మధ్యనే చంద్రబాబుని కలసి వచ్చారు. అయితే బీజేపీ లేకపోతే టీడీపీ అన్నట్లుగానే ఆయన వైఖరి ఉంది. జయసుధ అయితే ఎన్నికలు జరిగిన తరువాత ఒకసారి తన కుమారుడి వివాహం కోసం జగన్ కి కార్డు ఇచ్చేందుకు వెళ్లారు. ఆ మీదట ఆమె ఈ వైపుగా చూడలేదు. ఇక ఆమె తెలంగాణా రాజకీయాల్లో ఉంటారని, బీజేపీలో చేరవచ్చు అంటూ ప్రచారం సాగుతోంది.

మరో వైపు చూస్తే ఆ మధ్య దాకా జగన్ పార్టీ కోసం గొంతు చించుకున్న పోసాని క్రిష్ణ మురళి కూడా ఇపుడు సైలెంట్ అయ్యారు. ఆయన నేరుగా పవన్ కళ్యాణ్ తోనే పెట్టుకుని సినిమా అవకాశాలు కూడా పోగొట్టుకున్నారు అని చెబుతారు. అయినా ఆయనకు వైసీపీ నుంచి దక్కింది ఏమీ లేదని అంటారు. ఇక మరో వైపు చూస్తే జీవితారాజశేఖర్ వైసీపీకి దూరం అయి బీజేపీ కండువా కప్పుకున్నారు.

మిగిలిన నటులు కూడా తమ పనేంటో తామేంటో అన్నట్లుగా ఉన్నారు. దానికి వైసీపీ నిరాదరణ ఒక కారణం అయితే మరో వైపు టాలీవుడ్ కి వైసీపీ సర్కార్ కి మధ్యన అప్పట్లో టికెట్ల రేట్లు హైక్ కోసం వార్ జరిగింది. ఆ తరువాత టాలీవుడ్ లో వైసీపీ మద్దతుదారులుగా ఉన్న వారు కూడా ఇబ్బంది పడ్డారు. దాంతో చాలా మంది నోరెత్తడం మానేశారు అని అంటున్నారు. నిజానికి  టికెట్ రేట్ల విషయం కానీ, బెనిఫిట్ షోల విషయంలో కానీ జగన్ సర్కార్, టాలీవుడ్ ఇండస్ట్రీ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ చాలా మంది నటీనటులను ఇబ్బంది పెట్టిందనే అంటారు.

పైగా టాలీవుడ్ ని రెండు సామాజిక వర్గాలు శాసిస్తున్నాయి అని చెబుతారు. ఆ సామాజికవర్గాలకు చెందిన వారి పార్టీలు కూడా ఏపీలో కీలకంగా ఉన్నాయి. దాంతో కూడా వైసీపీకి సినీ గ్లామర్ అన్నది లేకుండా పోయింది అని అంటున్నారు. నిజానికి సినిమా వారికి ఓట్లు పడతాయా అంటే చెప్పలేరు కానీ వారికి జనాలలో ఆకర్షణ ఉంటుంది.

వారి చెప్పే మాటలను ప్రజలు  శ్రద్ధగా వింటారు. ఇక జనసీకరణ చేయాల్సిన అవసరం లేకుండా సినిమా వారు వస్తే జనాలు పోగవుతారు. అదే టైం లో సినీ గ్లామర్ ని సక్సెస్ ఫుల్ గా వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయని కూడా చరిత్ర చెబుతోంది. కానీ వైసీపీ హై కమాండ్ మాత్రం తన దగ్గరకు వచ్చిన సినీ పెద్దల విషయంలో పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించడంతో ఉన్న వారు జారిపోయారు. కొత్త వారు ఈ వైపు చూడని పరిస్థితి ఎదురవుతోంది.

ఈ నేపధ్యంలో  వైసీపీకి సినీ గ్లామర్ దక్కదా అంటే అది ఆలోచించాల్సిన విషయంగానే చూస్తున్నారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతూండడంతో వైసీపీ కూడా సినీ పెద్దలను మంచి చేసుకునే పనిలో పడుతోంది అని టాక్. తమ వద్ద ఉన్న పోసాని, అలీ లాంటి వారికి పదవులు ఇవ్వడం ద్వారా మరింతమందిని ఈ వైపుగా ఆకరిషించాలని చూస్తున్నారు అని అంటున్నారు.

కానీ అదంత సులువు కాదనే కూడా చెప్పుకోవాలి. అక్కడ పవర్ స్టార్ జనసేన సారధిగా ఉన్నారు. టీడీపీ పుట్టిందే సినీ గ్లామర్ తో. దాంతో జాతీయ పార్టీ బీజేపీయే సినీ గ్లామర్ కోసం నానా అవస్థలు పడుతున్న వేళ టాలీవుడ్ తో అనుకోని రచ్చను చేసుకుని కెలుక్కున్న వైసీపీకి సినిమా తళుకు బెళుకులు అందుతాయంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News