ఆగస్టు 15 స్పెషల్; అర్థరాత్రి వేళ స్వాతంత్ర్యం?

Update: 2015-08-15 05:14 GMT
అర్థరాత్రి వేళ దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వటం ఏమిటి? బ్రిటీషోడు కపటానికి ఇదోగుర్తుగా తిట్టేసే వాళ్లున్నారు. అయినా.. పగలంతా వదిలేసి అర్థరాత్రి వేళ భారతావనికి స్వాతంత్ర్యం ఎందుకు ఇచ్చింది? నాటి నాయకులు ఎందుకు ఒప్పుకున్నారన్న విషయాన్ని చూస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని బ్రిటన్ చట్టసభలో నిర్ణయం తీసుకున్నారు. ఇది జరిగిన వెంటనే.. నమ్మకాలు.. గ్రహ స్థితులపై నమ్మకాలు ఎక్కువగా ఉండే భారత్ లోని కొందరు ప్రముఖులకు ఒక సందేహం వచ్చింది. బ్రిటన్ సర్కారు నిర్ణయించిన ఆగస్టు 15 తేదీన స్వాతంత్ర్యం రావటం దేశానికి గ్రహాలు అనుకూలిస్తాయా? అన్న ప్రశ్న తలెత్తింది.

వెంటనే.. పుస్తకాల్ని ముందేసుకొని కూర్చున్న  పెద్దలకు ముందుగా నిర్ణయించిన ఆగస్టు 15 రోజు మంచిది కాదని తేల్చారు. 1947 ఆగస్టు 15 తేదీ చతుర్ధశి.. శుక్రవారమని.. తర్వాత అమావాస్య కనుక ఆగస్టు 15 ఏమాత్రం సరికాదని తేల్చారు. ఆగస్టు 15 కంటే కూడా ఆగస్టు 14 చాలా బాగుందని.. లేదంటే ఆగస్టు 17న మంచిరోజుగా తేల్చారు.

పండితులు సూచించిన రోజున దేశానికి స్వాతంత్య్రం తీసుకుంటామని చెప్పటం సాధ్యం కాదు. 14 ఓకే చెబుదామంటే.. ఆ రోజు గవర్నర్ జనరల్ పాక్ లో ఉండటం.. ఆగస్టు 17 చేసుకుందామంటే.. బ్రిటీష్ పార్లమెంటులో ఆమోదించిన తేదీ నాటికి స్వాతంత్ర్యం ఇవ్వాల్సిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఒక పెద్ద చిక్కుముడిగా మారింది. దీనికి పరిష్కారంగా హిందూమతాచారాలు.. సంప్రదాయాలపై లోతైన అవగాహన.. పట్టు ఉన్న కేఎం పణిక్కర్ ఒక పరిష్కారాన్ని చెప్పారు. అదేమంటే.. నాటి ఆగస్టు 15 ఉదయం గ్రహాలు అనుకూలంగా లేనందున.. రాజ్యాంగ సభ ఆగస్టు 14 రాత్రి 11 గంటలకు ప్రారంభమై.. సరిగ్గా 12 గంటలు కొట్టగానే బ్రిటీష్ ప్రభుత్వం నుంచి అధికారాన్ని స్వీకరిస్తుంది. ఇలా చేస్తే.. గ్రహాల అనుకూలంగా ఉండటంతో పాటు.. బ్రిటన్ పార్లమెంటులో చేసిన తీర్మానం ప్రకారమే స్వాతంత్య్రాన్ని ఇచ్చినట్లు అవుతుందని తేల్చారు.

ఈ కారణంగానే ఆగస్టు 14 అర్థరాత్రి దాటిన వెంటనే.. భారత్ కు స్వాతంత్య్రం ఇచ్చినట్లుగా ప్రకటన వెలువడటంతో పాటు.. జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మంచిరోజుగా భావించిన ఆగస్టు 14న ఏర్పడిన పాకిస్థాన్ కేవలం 20 ఏళ్ల వ్యవధిలోనే రెండు దేశాలుగా విడిపోతే.. అంత బాగోలేదన్న ముహుర్తంలో స్వాతంత్ర్యం పొందిన భారత్ మాత్రం రోజురోజుకీ మరింత బలోపేతం అవుతుందన్న మాట ఉంది.దీనికి.. మరో వాదన కూడా ఉండి. మంచి సమయం చూసి.. మరీ నిర్ణయించటం వల్లనే దేశం ఇలా ఉందని.. ఆగస్టు 14 మంచిదే అయినా.. అధికారబదిలీ జరిగిన సమయం మంచిది కాకపోవచ్చు కదా అని ప్రశ్నించే వారున్నారు.

ఇక.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన క్షణాల్ని గుర్తు చేసుకుంటే..

= ఆగస్టు 14వ తేదీ  రాజ్యాంగ నిర్ణయ సభ సమావేశం మొదలైంది.

= సభాధ్యక్షుడిగా వ్యవహరించిన బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రసంగించారు.

= సరిగ్గా అర్థరాత్రి 12 గంటలు కొట్టగానే అధికార బదిలీ జరిగినట్లుగా సభా నాయకుడు నెహ్రూ తీర్మానాన్ని ప్రతిపాదించారు.

= దాన్ని సభాధ్యక్షుడు ప్రవేశ పెట్టగానే సభ ఆమోదించింది. ఇది జరిగిన కొన్ని క్షణాలకే12 గంటలు కొట్టాయి.

= సభాధ్యక్షుడితో సహా.. సభ్యులంతా లేచి నిలుచొని ఒక్కో వ్యాక్యాన్ని చదువుతుండగా.. వాటిని ఇంగ్లిషు.. హిందీలలో సభ్యులు పునరుచ్ఛాట చేశారు.

= అనంతరం భారత పరిపాలనాధికారాన్ని రాజ్యాంగ సభ స్వీకరించింది.

= అంతేకాదు.. ఆగస్టు 15 నుంచి భారత గవర్నర్ జనరల్ గా లార్డు మౌంట్ బాటన్ ఉండాలన్న సిఫార్సును సభ ఆమోదించింది.

= ఈ విషయాన్ని మౌంట్ బాటన్ కు సభా నాయకుడు నెహ్రూ తెలియజేస్తారని సభాధ్యక్షులుగా ఉన్న బాబూ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.

= ఇది జరిగిన వెంటనే భారత జాతీయ పతాకాన్ని హన్స్ మెహతా సమర్పించారు.

= అధికార బదిలీని పురస్కరించుకొని భారత్ లో ఉన్న చైనా రాయబారి డాక్టర్ చిన్ ల్యున్ రచించిన గేయాన్ని సభ ఆమోదించింది.

= అనంతరం సారే జహాసే అచ్చా.. హిందుస్తాన్ హమారా గేయంలోని కొన్ని పంక్తుల్ని.. జనగణమణలోని ప్రారంభ వ్యాఖ్యాల్ని సుచేతా కృపలానీ ఆలపించారు.

= అలా దేశానికి స్వాతంత్ర్యం లభించింది. నాటి సభ అక్కడితో ముగిసి.. ఆగస్టు 15 ఉదయం 10 గంటలకు వాయిదా పడింది.

= దేశానికి స్వాతంత్ర్యం  అధికారికంగా ఆగస్టు 14 అర్థరాత్రి వచ్చినా..జెండా వందనం మాత్రం ఆగస్టు 15న ఉదయం 10 గంటల సమయంలో మన పార్లమెంటు భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

Tags:    

Similar News