అసాంజే లొంగిపోతాడా?

Update: 2016-02-05 17:30 GMT
చట్టవిరుద్ధంగా నిర్బంధించారంటూ ఇంగ్లండ్‌ - స్వీడన్‌ లకు వ్యతిరేకంగా తాను వేసిన కేసు వీగిపోతే, దౌత్య కార్యాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నానికల్లా విడిచి వెళతానని వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియస్ అసాంజే ప్రకటించారు. మళ్లి అప్పీల్‌ చేయడంలో అర్థం లేదని, బ్రిటిష్‌ పోలీసులకు లొంగిపోవడానికి తాను సిద్ధమేనని ఆయన చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితిలో తాను వేసిన దావా విజయవంతమైతే, తనను  అదుపులోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని తేలితే, తన పాస్‌ పోర్ట్‌ ను వెంటనే తిరిగివ్వాలని, తన అరెస్టుకు చేసే ప్రయత్నాలను ఆపాలని ఆయన అంటున్నారు. దౌత్యకార్యాలయంలో అతని మూడేళ్ల పైబడిన చట్టవిరుద్ధమైన నిర్బంధంపై ఐక్యరాజ్య సమతి కార్యాచరణ బృందం తన నివేదికను శుక్రవారం విడుదల చేస్తుందని భావిస్తున్న తరుణంలో ఆయన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

లండన్ నగరంలోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో గత మూడేళ్లుగా తాను తలదాచుకోవడాన్ని అక్రమ నిర్బంధం కాదని ఐరాస వర్కింగ్ గ్రూప్ ప్రకటిస్తే తాను శుక్రవారం మధ్యాహ్నమే బ్రిటిష్ పోలీసుల ఎదుట లొంగిపోతానని అసాంజే వెల్లడించారు. అసాంజే ప్రకటనను వికీలీక్స్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ లో పోస్ట్ చేసింది. 44 ఏళ్ల అసాంజేకు ఈక్వెడార్ రాజకీయ ఆశ్రయం ఇవ్వడంతో ఆయన 2012 నుంచి సెంట్రల్ లండన్‌ లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలోని ఒక చిన్న గదిలో ఉంటున్నారు. తాను అంతరిక్ష కేంద్రంలో ఉన్నట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. అసాంజే తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని స్వీడన్‌ లోని ఇద్దరు మహిళలు ఆయనపై కేసు పెట్టారు. ఒకవేళ ఈక్వెడార్ దౌత్య కార్యాలయం నుంచి బయటకు వస్తే బ్రిటిష్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి స్వీడన్‌ కు అప్పగిస్తారు. అంతటితో ఆగిపోదు. స్వీడన్ తనను అమెరికాకు అప్పగిస్తుందని, రహస్య పత్రాల బహిర్గతం విషయంలో అమెరికా తనను ఇంటరాగేట్ చేస్తుందని అసాంజే భయపడుతున్నారు.

అసాంజే 2006లో స్థాపించిన వికీలీక్స్ అఫ్గానిస్తాన్ - ఇరాక్ యుద్ధాలకు సంబంధించిన అయిదు లక్షల అమెరికా మిలిటరీ రహస్య దస్త్రాలను విడుదల చేసింది. అమెరికా వివిధ దేశాలతో జరిపిన రెండున్నర లక్షల రహస్య దౌత్య కేబుళ్లను కూడా బహిర్గతం చేసింది. అమెరికా గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు అమెరికా సోల్జర్ చెల్సియా మానింగ్‌ కు ఆ దేశం ఇప్పటికే 35 ఏళ్ల జైలుశిక్షను విధించింది.

లండన్‌ లోని ఈక్వెడార్ ఎంబసీలో తాను ఆశ్రయం పొందిన ఈ మూడేళ్ల కాలాన్ని అక్రమ నిర్బంధంగా ప్రకటించాలని అసాంజే ఐరాస వర్కింగ్ గ్రూప్‌ కు ఇదివరకే ఫిర్యాదు చేశారు. అసాంజే ఫిర్యాదును విచారించిన వర్కింగ్ గ్రూప్ శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇదిలా ఉండగా, అసాంజే తనంత తానుగానే చట్టబద్ధమైన నిర్బంధం నుంచి తప్పించుకుంటున్నారని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా, లైంగిక దాడికి సంబంధించి ఇద్దరు మహిళలు చేసిన ఫిర్యాదుపై స్వీడన్ ప్రాసిక్యూటర్లు అసాంజేను ఈక్వెడార్ ఎంబసీలోనే విచారించనున్నారు.
Tags:    

Similar News