హైదరాబాద్ లో కోవీషీల్డ్ వేసుకున్న మహిళ కోమాలోకి? ఎంతవరకు నిజం?

Update: 2021-04-11 04:50 GMT
నిజం కంటే అబద్ధం చాలా వేగంగా ప్రచారం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సంచలనం చోటు చేసుకున్నా.. అరుదైన ఉదంతం చోటు చేసుకున్నా.. క్షణాల్లో ఆ వివరాలు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ హడావుడి చేస్తాయి. కాసేపటికే టీవీల్లో బ్రేకింగ్ న్యేూస్ లుగా పడతాయి. కానీ.. దానికి సంబంధించి తర్వాత ఏమైందన్న అప్డేట్ మాత్రం సరిగా రాదు. ఇలాంటి పరిస్థితితో లేనిపోని భయాలు.. ఆందోళనలు ఎక్కువ అవుతాయి. తాజా ఉదంతం దీనికి అతి పెద్ద ఉదాహరణగా చెప్పాలి.

హైదరాబాద్ శివారులోని ఫిర్జాదిగూడలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తోంది 30 ఏళ్ల లత. ఆమెకు శనివారం సాయంత్రం స్థానిక హెల్త్ సెంటర్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకుంది. కాసేపటికే ఆమె తీవ్ర అస్వస్థతకు గురై.. స్పృహ కోల్పోయారు. అంతే.. సోషల్ మీడియాలో ఈ సమాచారం విపరీతంగా వైరల్ గా మారింది. కారణం ఏమిటన్న లోతుల్లోకి వెళ్లకుండా? ఆ తర్వాతేమైందన్న అప్డేట్ ఇవ్వకుండా.. కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.. స్పృహ కోల్పోయారన్న మాటతో పాటు.. మరో అడుగు ముందుకు వెళ్లి.. కోమాలోకి వెళ్లిపోయినట్లుగా అవసరానికి మించిన అతిని ప్రదర్శించారు.

వాస్తవం ఏమిటంటే.. కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లటం నిజం. కాకుంటే..ఇది వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టు కారణం కంటే కూడా.. తీవ్రమైన భయాందోళనలకు గురైన ఆమె ఇలాంటి పరిస్థితిని తెచ్చుకున్నారు. వాస్తవానికి టీకా వికటిస్తే.. ఒంటి మీద దద్దుర్లు లాంటివి వస్తాయి. కానీ.. అలాంటిదేమీ లేకుండా కళ్లు తిరగటం.. స్పృహ కోల్పోవటం లాంటివన్నీ కూడా తీవ్రమైన భయాందోళనలకు గురైన వారికి మాత్రమే కలుగుతుందన్నది మర్చిపోకూడదు.

మొన్నీ మధ్యనే ఒక ఐపీఎస్ అధికారి సతీమణి కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చినంతనే స్పృహ కోల్పోవటం సంచలనంగా మారింది. ఆమెను హుటాహుటిన ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. వాస్తవానికి.. టీకా వేయించుకునే వేళలో ఆమె తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారు. అంతకు మించిన సందేహాలు కూడా ఆమెకున్నాయి. ఇదే.. స్పృహ కోల్పోవటానికి కారణమైంది.

ఫిర్జాదిగూడ ఎపిసోడ్ కూడా ఈ కోవలోకే  వస్తుంది. టీకా ఇచ్చిన కాసేపటికే కళ్లు తిరిగి పడిపోయిన ఆమెను.. వెంటనే గాంధీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించటంతో కోలుకున్నారు. శనివారం రాత్రే డిశ్చార్జి అయినట్లుగా సమాచారం. అందుకు భిన్నంగా.. ఆమె కోమాలోకి వెళ్లిపోయినట్లుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. వ్యాక్సిన్ వేయించుకునే వారు.. దాని మీద ధీమాతో పాటు.. అనవసరమైన భయాందోళనలకు గురైతేనే ఇబ్బంది. లేకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రావన్న విషయాన్ని మర్చిపోకూడదు.


Tags:    

Similar News