కుప్పం పోయినా ఫ‌ర్వాలేదా? టీడీపీ నేత‌లు ఏమంటున్నారంటే

Update: 2020-11-05 16:10 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గం. ఏ పార్టీ నాయ‌కుడైనా.. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఒక‌వేళ అనూహ్య పరిస్థితి ఏర్ప‌డి.. ఓడిపోయినా.. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో అయినా.. స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గాన్ని కంటికి రెప్ప‌మాదిరిగా కాపాడుకుంటార‌న‌డంలో సందేహం లేదు. అక్క‌డే పాగా వేసి.. ప‌రిస్థితులు త‌న‌కు అన‌నుకూలంగా మార‌కుండా చూసుకోవ‌డం ఏ నేత అయినా చేసే ప‌ని.

అయితే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. మాత్రం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గాన్ని గాలికి వ‌దిలేశారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. ఇవేవో.. ఆయ‌నంటే గిట్ట‌నివారు.. అతిశ‌యోక్తిగా చెబుతున్న మాటలు కాదు. విమ‌ర్శ‌లు అంత‌క‌న్నా కాదు. వాస్త‌వ ప‌రిస్థితినే వారు ఉటంకిస్తున్నారు. ఇక‌, టీడీపీ నేత‌లు కూడా మా నాయ‌కుడు త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేసుకుంటున్న‌ట్టారు! అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇక్క‌డ అధికార పార్టీ దూకుడు పెంచ‌డ‌మే!! సాధార‌ణంగా.. ఎవ‌రు అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు పెద్ద‌దిక్కుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తారు.

గ‌తంలో చంద్ర‌బాబు కూడా ఇలానే చేశారు. వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉన్న అనేక నియోజ‌క‌వ‌ర్గాల‌ను వెతికి ప‌ట్టుకుని అభివృద్ధి పేరిట త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే, వైసీపీ నాయ‌కులు.. పెద్ద అల‌జ‌డే సృష్టించారు. త‌మ ఆధిప‌త్యం త‌గ్గ‌కుండా చూసుకున్నారు. అందుకే.. క‌డ‌ప వంటి జిల్లాల్లో కోట్లు కుమ్మ‌రించినా.. చంద్ర‌బాబుకు ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. నంద్యాల‌లోను.. ఇదే జ‌రిగింది. ఇక‌, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రిగిందో కూడా తెలిసిందే. అయితే, త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ దూకుడు పెంచినా.. త‌న ఆధిప‌త్యం త‌గ్గుతున్న సంకేతాలు స్ప‌ష్టంగా తెలుస్తున్నా.. చంద్ర‌బాబు మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉంటున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

చంద్ర‌బాబును కూడా ఓడించాల‌నే సంక‌ల్పంతో ఇక్క‌డ వైసీపీ అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టింది. దీంతో చంద్ర‌బాబుకు ఇబ్బంది క‌ర ప‌రిస్థితులు మొద‌ల‌య్యాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేస‌మ‌యంలో టీడీపీని నిర్వీర్యం చేసే ల‌క్ష్యంతో ఆ పార్టీ శ్రేణుల‌ను వైసీపీలోకి చేర్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌లోభాలు, బ‌ల‌వంతాలు, అవ‌స‌ర‌మైతే.. కేసుల‌కు కూడా వెనుకాడ‌డం లేదు. దీంతో పార్టీ పూర్తిగాఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి కూరుకుపోతున్నా.. చంద్ర‌బాబు మౌనంగా ఉంటున్నార‌ని సీనియ‌ర్ నేత‌లు ఫైర‌వుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News