విదేశీ భాషలు నేర్చుకోండి - అబ్రాడ్ వెళ్లండి: టీచర్లకు సీఎం యోగి

Update: 2020-02-10 17:25 GMT
రాష్ట్రంలోని ఉపాధ్యాయులు విదేశాల్లో పనిచేసేందుకు వీలుగా విదేశీ భాషలు కూడా నేర్చుకోవాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దిగ్విజయ్‌ నాథ్ ఎల్‌ టీ ట్రెయినింగ్ కాలేజీలో నిర్వహించిన సెమినార్‌ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. టీచర్లకు విదేశాల్లో బోధించేందుకు వీలుగా విదేశీ భాషలు నేర్పించాలని సూచించారు. భారతీయ ఉపాధ్యాయులకు విదేశాల్లో డిమాండ్ ఉందన్నారు.

దేశంలోని ఉపాధ్యాయులను విదేశాలకు పంపించే విధంగా వారి అర్హతలను పెంపొందించాలని హితవు పలికారు. యూపీలోని విద్యా సంస్థలన్నీ కూడా ఏయే దేశాల్లో ఉపాధ్యాయుల అవసరం ఏ మేరకు ఉంది.. ఎక్కడ ఏ భాషలు మాట్లాడుతారో గుర్తించాలని - అలా గుర్తించిన భాషలను టీచర్ ట్రెయినింగ్ పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థులకు భారీ డిమాండ్ ఉందన్నారు.

ఇటీవల నిర్వహించిన యూపీ బేసిక్ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారని గుర్తు చేశారు. బేసిక్ ఎడ్యుకేషన్ నిర్వహించిన పరీక్షలో శిక్షణ పొందిన 70 శాతం మంది గ్రాడ్యుయేట్ అభ్యర్థులు విఫలమయ్యారన్నారు. మన విద్యా వ్యవస్థ నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

   

Tags:    

Similar News