పవన్ ఇంటి ముందు యువతి హడావుడి

Update: 2016-09-29 05:14 GMT
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి ముందు ఒక యువతి ఆందోళనకు దిగింది. గడిచిన నాలుగు రోజులుగా ఆ యువతి పవన్ ఇంటి ముందు ఉన్నట్లు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ లోని పవన్ ఇంటి దగ్గర ఉన్న ఆమెను జ్యోతిగా చెబుతున్నారు. తాను పవన్ కల్యాణ్ ను కలిసేందుకు వచ్చినట్లుగా చెప్పిన ఆమె.. సిబ్బందిని తనను ఇంట్లోకి అనుమతించాల్సిందిగా కోరారు.

అయితే.. ప్రస్తుతం పవన్ అందుబాటులో లేరని చెప్పినా.. ఆమె వినలేదు. దీంతో.. ఆమె వ్యవహారంపై సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. పవన్ ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. రోడ్డు మీద కూర్చొని ఆందోళనకు దిగింది. తాను ఎలాంటి హడావుడి చేయకున్నా.. పోలీసులు తనను ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించిన ఆమె.. పోలీసులు తనతో అసభ్యకరంగా వ్యవహరించారంటూ ఆరోపించింది.

మరోవైపు పోలీసులు ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. ఆమె మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఇదేనా? అంటూ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ ఇంటి ఎదుట బైఠాయించింది. కాసేపు ఆమె తీరు మారుతుందేమోనని ఎదురుచూసిన పోలీసులకు.. ఆమె వైనం ఇబ్బందికరంగా మారటంతో ఆమెను.. పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమె ఎవరు? ఎందుకు నాలుగు రోజులుగా పవన్ ఇంటి వద్దే ఉందన్న వివరాలు బయటకు రావాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News