సత్తిబాబు రేంజ్ కు వైఎస్ఆర్సీపీ చాలా తక్కువట!

Update: 2019-11-05 15:55 GMT
తన రేంజ్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ అని బాధపడిపోతూ ఉన్నారు మంత్రి  బొత్స సత్యనారాయణ! తను రెండు అడుగులు దిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టుగా ఆయన మరోసారి వాపోయారు!

ఒక రాజకీయ నేత తన మనుగడకు పార్టీలు మారుతూ ఉంటాడు. అలాంటి వారితో బొత్స కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పాల్పడుతున్నంత సేపు కూడా ఆ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీ తరఫున విభజన తర్వాతి ఎన్నికల్లో ఒకసారి పోటీ చేశారు కూడా. అయితే సత్తిబాబు సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున నెగ్గలేకపోయారు!

అప్పటికి కానీ తన రేంజ్ ఏమిటో ఈయనకు అర్థం అయినట్టుగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో దుంపనాశనం అయ్యాకా.. ఇక కాంగ్రెస్ లో ఉండి ప్రయోజనం లేదని బొత్స వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అలాంటి ఎంతో మంది కాంగ్రెస్ నేతల్లో బొత్స కూడా ఒకరు.

అయితే వారెవరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి తమ రేంజ్ ను దిగజార్చుకున్నట్టుగా వాపోవడం లేదు. కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరిన వారిలో బొత్స కన్నా రాజకీయంగా బలమైన వాళ్లున్నారు. అయితే వారెవరూ తమ రేంజ్ తగ్గిందని ఇప్పటి వరకూ అన్నదే లేదు. అయితే సత్తిబాబు మాత్రం తరచూ ఈ మాట చెబుతూ ఉన్నారు.

అలాగని బొత్సకు వైసీపీలో తక్కువ అయినది ఏమీ లేదు. ఆయనకు మంత్రి పదవి దక్కింది, ఫ్యామిలీ ప్యాకేజ్ ప్రకారం టికెట్లు దక్కాయి! అయినా తను రెండు అడుగులు దిగి వైసీపీలోకి చేరినట్టుగా మరోసారి చెప్పుకొచ్చారు.

పవన్ కల్యాణ్ మీద విరుచుకుపడుతూ.. సత్తిబాబు ఇలా వైసీపీలోకి చేరడం పట్ల తన ఆవేదన వ్యక్తం చేసేశారు. ఇంతకీ ఈ మాటలతో సత్తిబాబు ఏం చెబుతున్నట్టు? అంత బాధపడటం ఎందుకు..వైసీపీకి రాజీనామా చేసేయవచ్చు కదా!

తన రేంజ్ ను తనే తగ్గించుకోవడం కన్నా బొత్స మంత్రి పదవిని, అధికార పార్టీని వదులుకోవడమే మంచిదని ఆయన ఆవేదనను గమనించిన పరిశీలకులు చెబుతూ ఉన్నారు. మనిషికి రాజకీయం, పదవులు కన్నా.. ఆత్మసంతృప్తి ముఖ్యం కదా, అలాంటి సంతృప్తి  లేనట్టుగా ఉంది సత్తిబాబుకు. వైసీపీలోకి చేరడంతో తన రేంజ్ అంతా తగ్గిపోయినట్టుగా అనిపిస్తోందాయనకు.

'ఇంకేటి చేత్తాం.. రాజీనామా కాదేంటీ....' అంటూ ఉత్తరాంధ్రలోని బొత్స అభిమానులు సూచిస్తున్నారు. అందుకు సత్తిబాబు సిద్ధమేనా? స్థాయి తగ్గిపోయిందని బాధపడుతున్న సత్తిబాబు అలాంటి త్యాగానికి సిద్ధమేనా.. లేక తన స్థాయి తగ్గిపోయిందంటూ ఉత్తమాటలు మాట్లాడతున్నాట్టా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు! పార్టీ బలం లేకపోతే సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నెగ్గుకు రాలేకపోయిన బొత్స ఇలాంటి మాటలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News