జైట్లీ.. వెంకయ్య.. బాబు మాట తప్పని తేల్చేశారు

Update: 2016-10-03 05:34 GMT
ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడే సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు తరచూ వినిపించే వాదనలో పస లేదని తేలిపోయింది. ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు చెప్పే మాటల్ని తూచా తప్పకుండా వల్లె వేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం అవగాహన లేదని తేలిపోయింది. ఏపీకి ఇవ్వాల్సిన హోదాకు.. ఆర్థిక సంఘానికి ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్.. 14వ ఆర్థిక సంఘం ఛైర్మన్ గా పని చేసిన డాక్టర్ వైవీ రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని మంథన్ సంస్థ హైదరాబాద్ లో ఒక భారీ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో కేంద్ర.. రాష్ట్ర సంబంధాలు అన్న అంశంపై మాట్లాడిన వైవీ రెడ్డి.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రులు చెబుతున్న మాటల్లో ఏమాత్రం నిజం లేదన్న విషయాన్ని తన మాటలతో చెప్పకనే చెప్పేశారు.

ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా రాష్ట్రలన్నింటినీ ఆర్థిక సంఘం ఒకేలా చూస్తుందన్న ఆయన.. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల ఆధారంగానే ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తుంని చెప్పారు. తాను పని చేసిన సమయంలో ఆర్థిక సంఘం ఏ రాష్ట్రాన్నీ.. ఎవరినీ సంతృప్తి పర్చలేదని.. అందరిని సమానంగా అసంతృప్తితో ఉంచటమే పనిగా వ్యవహరించినట్లుగా వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన ఆయన.. కేంద్రం అనే పదం రాజ్యాంగంలోనే  లేదని.. కేవలం ‘‘యూనియన్ గవర్నమెంట్’’ అన్న పదం మాత్రమే ఉంద‌ని చెప్పారు.

జీఎస్టీ వల్ల కేంద్ర.. రాష్ట్రాల మధ్య సంబంధాల్లో మరింత మార్పు వస్తుందని.. కొత్త పన్ను విధానంతో కేంద్రం మరింత బలపడుతుందన్నారు. భారత తొలి ప్రధాని నెహ్రూ హయాంలో ఆయన తరచూ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ ఉండేవారని.. చాలా చక్కటి సంబంధాలు ఉండేవన్నారు. రాజ్యాంగం ఏర్పడిన 30 ఏళ్ల‌ తర్వాత కేంద్రంపై రాష్ట్రాల వ్యతిరేకత పెరిగిందని.. రాష్ట్రాలు కీలకంగా మారాయన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ ఉండటాన్ని ఆయ‌న‌ ప్రస్తావించారు. తన మాటలతో ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాకు.. ఆర్థిక సంఘానికి ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని తేల్చేసినట్లు చెప్పాలి. మరి.. వైవీ రెడ్డి వ్యాఖ్యలపై జైట్లీ.. వెంకయ్యలు ఏం సమాధానం చెబుతారన్నది ఒక ప్రశ్న అయితే.. కేంద్ర మంత్రులు చెప్పిన మాటల్నే చిలక పలుకులుగా చెప్పే చంద్రబాబు సైతం మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చెప్పిన మాటలపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News