అంతర్జాతీయ క్రికెట్ లో బ్యాట్ విడిచిపెట్టిన ఓ దిగ్గజం

కానీ, ఇకపై అతడు దేశం తరఫున మైదానంలో కనిపించడు.

Update: 2024-01-06 12:30 GMT

అంతర్జాతీయ క్రికెట్ లో వందకు పైగా టెస్టులు.. 160 వన్డేలు.. 99 టి20లు.. మూడు ఫార్మాట్లలోనూ ఓపెనర్.. లీగ్ క్రికెట్ లోనూ దుమ్మురేపే బ్యాట్స్ మన్.. ఇదంతా ఓ ఆస్ర్టేలియా క్రికెటర్ గురించి.. అతడు మన భారతీయులకూ సుపరిచితుడే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్సీ కూడా చేపట్టి కప్ అందించాడు. కానీ, ఇకపై అతడు దేశం తరఫున మైదానంలో కనిపించడు. ఓ విధంగా చెప్పాలంటే.. అంతర్జాతీయ క్రికెట్ లో ఓ శకం ముగిసింది.

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ శనివారంతో ముగిసింది. పాకిస్థాన్ తో సొంతగడ్డ సిడ్నీలో జరిగిన మూడో టెస్టే అతడికి చివరిది. దీనికిముందు భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో వార్నర్ 535 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలవడంలో అతడిదే కీలక పాత్ర అని చెప్పాల్సిన పనిలేదు. కాగా.. వార్నర్ ప్రపంచ కప్ తర్వాత వన్డేలు ఆడలేదు. పాకిస్థాన్ తో మూడు టెస్టుల సిరీస్ లో ఒక సెంచరీ సహా 299 పరుగులు చేశాడు. శనివారం చివరి ఇన్నింగ్స్ లోనూ అర్ధ సెంచరీ సాధించాడు. 2011లో న్యూజిలాండ్ పై అరంగేట్రం చేసిన వార్నర్ 112 టెస్టుల్లో 26 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలతో 8,786 పరుగులు (సగటు 44.59) చేశాడు. 161 వన్డేల్లో 6,932 పరుగులు, 99 టి20ల్లో 2,894 పరుగులు చేశాడు.

ఐపీల్ లో హైదరాబాదీలకు దగ్గర

వార్నర్ ఐపీఎల్ లో రెండు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. అందులో ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్. మరోటి ఢిల్లీ క్యాపిటల్స్. 13 ఏళ్లుగా అతడు లీగ్ లో ఆడుతున్నాడు. 2016లో సన్ రైజర్స్ చాంపియన్ గా నిలవడంలో వార్నర్ కీలక భూమిక పోషించాడు. గత సీజన్ వరకు హైదరాబాద్ కు ఆడిన అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు మారాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగినప్పటికీ లీగ్ లు ఆడతానని వార్నర్ చెప్పాడు. అతడికి 37 ఏళ్లు. దీంతో మరో రెండేళ్లయినా పోటీ క్రికెట్ లో కొనసాగే చాన్సుంది.

ఆ మచ్చ.. కెరీర్ కే మరక

2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ వివాదం వార్నర్ కెరీర్ లో పెద్ద మచ్చ. తోటి ఓపెనర్ కామెరూన్ బాంక్రాఫ్ట్, నాటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఆందులో భాగస్వాములు అయినప్పటికీ.. ట్యాంపరింగ్ కు ప్రధాన కారణం వార్నరే. దీంతో అతడిపై ఏడాది నిషేధం విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అంతేగాక.. భవిష్యత్ లో కెప్టెన్సీ చేపట్టకుండా అనర్హుడిగా ప్రకటించింది. ఈ కారణంగానే వార్నర్ ప్రతిష్ఠాత్మకమైన ఆస్ట్రేలియా కెప్టెన్ కాలేకపోయాడు. అయితే, తాను చేసినది తప్పేనని అంగీకరించి.. ఏడాది నిషేధం అనంతరం తిరిగొచ్చిన వార్నర్ గత ఐదేళ్లలో మెరుగ్గా రాణించాడు. నిషేధం తాలూకు చేదు గుర్తులను చెరిపేశాడు.

పుష్ప... ది వార్నర్

భారత క్రికెటర్లకూ వార్నర్ చాలా సన్నిహితుడు. చాలామందితో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక భారత సినిమాలను వార్నర్ బాగా ఇష్టపడతాడు. మరీ ముఖ్యంగా తెలుగు దర్శకుడు సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ‘పుష్ఫ’లో తగ్గేదేలే సీన్ ను అనుకరిస్తూ మైదానంలో, వీడియోల్లో వార్నర్ చేసిన యాక్షన అందరికీ గుర్తుండిపోతుంది.

Tags:    

Similar News