మహిళలు, పురుషులు.. ఒక టి20 ప్రపంచకప్.. ఎవరు విజేత?
కానీ, మహిళలు మాత్రం పట్టు వదల్లేదు.. పురుషుల్లాగా ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టలేదు.
బంగ్లాదేశ్ లో జరగాల్సిన టి20 ప్రపంచ కప్ అనేక మలుపుతు తిరిగి భారత్ మీదుగా దుబాయ్ కి చేరింది.. ఎంత నాటకీయ పరిస్థితుల్లో వేదిక మారిందో.. అంతే నాటకీయంగా ఫలితం వచ్చింది. వరుసగా రెండు వన్డే ప్రపంచ కప్ లలో ఫైనల్ కు.. కానీ, చివరి మెట్టుపై బోల్తా.. వరల్డ్ కప్ ఎక్కడైనా జరగనీ.. ఆ జట్టు కనీసం సెమీఫైనల్ కు చేరుతుందన్న పేరు.. అయితే, వరల్డ్ కప్ మాత్రం నెగ్గలేదు. ఇదీ న్యూజిలాండ్ పురుషుల జట్టు పరిస్థితి. 50 ఏళ్లుగా కివీస్ వన్డే ప్రపంచ కప్ లలో పాల్గొంటున్నా ఆ జట్టుకు టైటిల్ మాత్రం కలగానే మిగిలిపోతోంది. కానీ, మహిళలు మాత్రం పట్టు వదల్లేదు.. పురుషుల్లాగా ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టలేదు. తమ దేశానికి తొలి ప్రపంచ కప్ అందించారు.
ఓడిపోతుంది అనుకుంటే..
టి20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్.. రెండు జట్లలో ఏది గెలిచినా తొలిసారి చాంపియన్. అయితే, దక్షిణాఫ్రికా వరుసగా రెండో ఫైనల్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకే ఎక్కువమంది ఓటు వేశారు. పైగా ఆస్ట్రేలియాలాంటి మేటి జట్టును సెమీఫైనల్లో ఓడించిన దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్ ను మడత పెట్టేస్తుందని భావించారు. కానీ, ఫలితం వేరుగా వచ్చింది. న్యూజిలాండ్ విజేతగా నిలిచింది.
పురుషుల్లాగే మహిళలు..
దక్షిణాఫ్రికా పురుషుల జట్టు ఈ ఏడాది జూన్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో తొలిసారి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. కానీ, భారత్ చేతిలో ఓడిపోయింది. చివరి ఓవర్ వరకు పోరాడిన ఆ జట్టు పరాజయం ఎదుర్కొంది. దాదాపు అలాంటి పరిస్థితే ఇప్పుడు దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు ఎదురైంది. దీంతో ప్రపంచ విజేతగా నిలవాలన్న ఆ జట్టు కల నెరవేరలేదు. ఒకే ఏడాది పురుషుల, మహిళల క్రికెట్ లో సఫారీలకు ఒకే విధమైన పరిస్థితి ఎదురవడం గమనార్హం.
మోస్తరు లక్ష్యమే.. కానీ, ఒత్తిడికి చిత్తు
పెద్ద టోర్నీల్లో తనంతట తాను ఒత్తిడికి గురై టైటిల్ కోల్పోవడం దక్షిణాఫ్రికా పురుషుల జట్టుకు ఉన్న సహజ లక్షణం. ఇప్పుడదే విధంగా మహిళలూ ఓడారు. 20 ఓవర్లలో 159.. టి20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా లక్ష్యం ఇది. మోస్తరు లక్ష్యమే.. పైగా ఈ ప్రపంచకప్‌లో బ్యాటింగ్ లో సఫారీలు అదరగొడుతున్నారు. దీంతో దక్షిణాఫ్రికా దూకుడుగా ఆట మొదలుపెట్టింది. కెప్టెన్, ఓపెనర్ లారా వోల్వార్ట్ అయితే ఐదు బౌండరీలతో చెలరేగింది. పవర్ ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి 47. ఒక్క వికెట్ కూడా పడలేదు. ఇక దక్షిణాఫ్రికాదే ప్రపంచ కప్ అని అందరూ భావించారు. కానీ.. కాసేపటికే అంతా తలకిందులైంది. చివరకు న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది.
కెర్ కెవ్వు కేక..
ఫైనల్లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ కు దిగి 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. మేటి ఆల్ రౌండర్ అమేలియా కెర్ 38 బంతుల్లో 4 ఫోర్లతో 43 పరుగులు చేసింది. బ్రూక్ హాలీడే 28 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు, సుజీ బేట్స్ 31 బంతుల్లో మూడు ఫోర్లతో 32 పరుగులు చేశారు. బ్యాటింగ్ లో దుమ్మురేపిన కెర్.. బౌలింగ్ లోనూ చెలరేగింది 24 పరుగులకే మూడు వికెట్లు తీసింది. దీంతో దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. వోల్వార్ట్ (33) టాప్ స్కోరర్. కాగా, ఓపెనర్ తజ్మిన్ (17)ను న్యూజిలాండ్ పేసర్ జోనాస్ (1/28) ఔట్ చేసి 51 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించింది. అక్కడినుంచి ఒత్తిడికి లోనైన సఫారీలు వికెట్లు పారేసుకున్నారు. కెర్.. ఒకే ఓవర్లో వోల్వార్ట్, బాష్ (9)లను ఔట్ చేసింది. 14 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 86 పరుగులు మాత్రమే చేసి ఓటమి అంచున నిలిచింది. చివరకు 126 పరుగుల వద్దే ఆగిపోయింది.
ఆ 27 పరుగులు..
బ్యాటింగ్ లో చివరి రెండు ఓవర్లలో న్యూజిలాండ్ 27 పరుగులు చేసింది. ఆ జట్టు గెలిచింది 32 పరుగుల తేడాతో. అయితే, 13 ఓవర్లకు న్యూజిలాండ్
మూడు వికెట్లకు 85 పరుగులే చేసింది. 130 అయినా దాటుతుందా? అనిపించింది! ఆఖరి 7 ఓవర్లలో 73 పరుగులు రాబట్టింది. కెర్ 22 బంతుల్లో 19 పరుగులే చేసింది. ఓ దశలో 48 బంతుల పాటు బౌండరీనే లేదు. బ్రూక్ గేర్ మార్చడం, కెర్ జోరు పెంచడంతో స్కోరు బోర్డు దూసుకెళ్లింది. వరుస ఓవర్లలో బ్రూక్, అమేలియా ఔటైనా.. ఆఖరి ఓవర్లో గ్రీన్ (12 నాటౌట్) సిక్సర్ తో ఇన్నింగ్స్ కు మెరుపు ముగింపు దక్కింది.
కొసమెరుపు: న్యూజిలాండ్ పురుషుల జట్టు ఆదివారం భారత్ పై 36 ఏళ్ల తర్వాత భారత్ లో టెస్టు నెగ్గింది. ఇదే ఆదివారం న్యూజిలాండ్ మహిళలు టి20 ప్రపంచ కప్ ను గెలుచుకున్నారు. డబుల్ ధమాకా సాధించారు. చివరి బంతి కాగానే న్యూజిలాండ్ మహిళలు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోగా.. దక్షిణాఫ్రికా అమ్మాయిలు బాధతో కన్నీళ్లు కార్చారు.