ప్రపంచ కప్ లో టీమిండియాకు ప్రియ శత్రువు.. ఈ మొనగాళ్లే ఆపాలి

దసరా సంబరం ఆస్ట్రేలియాను మట్టికరిపించి.. పాకిస్థాన్ పడగొట్టి.. బంగ్లాను బెంబేలెత్తించి.. అఫ్ఘాన్ ను ఆటాడుకున్న టీమిండియాకు దసరా పండగ ముందర ఆదివారం పసందైన మ్యాచ్ ను చూసే భాగ్యం దక్కనుంది.

Update: 2023-10-21 09:32 GMT

ఇరు జట్లు చెరో నాలుగు మ్యాచ్ లు గెలిచాయి.. ఇరు జట్లూ మంచి జోరుమీదున్నాయి.. బ్యాట్స్ మెన్ అదరగొడుతుంటే.. బౌలర్లు వికెట్లు పడగొడుతున్నారు.. ఆల్ రౌండర్లు అదరహో అనేలా ఆడుతున్నారు. అలాంటి జట్ల మధ్య సమరం అంటే అది రసకందాయమే.. అందులోనూ ఆ రెండు జట్లలో ఒకటి మన టీమిండియా అయితే.. ఆ ప్రత్యర్థి జట్టు మనకు ప్రియమైన శత్రువు అయితే.. ఆ మ్యాచ్ ఆదివారం నాడు జరిగితే.. రోహిత్ సేన చెలరేగి ఆడితే.. ఇంకేం..? దసరా పండుగ ముందే వచ్చేసినట్లు కాదూ..?

దసరా సంబరం ఆస్ట్రేలియాను మట్టికరిపించి.. పాకిస్థాన్ పడగొట్టి.. బంగ్లాను బెంబేలెత్తించి.. అఫ్ఘాన్ ను ఆటాడుకున్న టీమిండియాకు దసరా పండగ ముందర ఆదివారం పసందైన మ్యాచ్ ను చూసే భాగ్యం దక్కనుంది. ప్రపంచ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో మన జట్టు రేపు తలపడనుంది. ఇరు జట్లూ నాలుగు విజయాలు సాధించినా.. రన్ రేట్ ప్రకారం న్యూజిలాండ్ ముందంజలో ఉంది. మిగతా జట్లన్నీ కనీసం ఒక మ్యాచ్ లో అయినా ఓడినందున ఆదివారం నాటి మ్యాచ్ లో గెలిచిన జట్టు టాప్ లోకి వెళ్తుంది.

మనకు ప్రియ శత్రువు..టీమిండియాకు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ అయితే.. ప్రియమైన శత్రువు న్యూజిలాండ్. 2000 సంవత్సరం చాంపియన్స్ ట్రీఫీ ఫైనల్, 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్స్... ఇలాంటి ఎన్నో సమయాల్లో భారత జట్టును ఓడించి అభిమానులను తీవ్రంగా బాధించింది న్యూజిలాండ్. అంతెందుకు..? ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లోనూ టీమిండియాను ఓడించింది న్యూజిలాండ్.

ఈ ముగ్గురే అడ్డుకోవాలి..టీమిండియా బ్యాటింగ్ మూల స్తంభాలు రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్. ఈ ముగ్గరూ భీకర ఫామ్‌లో ఉన్నారు. అఫ్గాన్‌పై రోహిత్ సెంచరీ కొట్టాడు. పాక్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌పై అర్ధ శతకం చేశాడు. కోహ్లీ పాకిస్థాన్ తో విఫలమైనా.. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో రాణించాడు. బంగ్లాదేశ్‌పై మెరుపు సెంచరీ చేశాడు. రాహుల్ టోర్నీలో మూడు మ్యాచ్ లలో బ్యాటింగ్ కు దిగినా.. నాటౌట్ గానే ఉన్నాడు. ఈ ముగ్గురూ రాణిస్తే కివీస్ బౌలర్లకు కష్టాలే. యువ ఓపెనర్ గిల్, మిడిలార్డర్ లో శ్రేయస్ అయ్యర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నారు. ఆల్ రౌండర్ జడేజా ఎలాగూ ఉన్నాడు. అయితే , హార్దిక్ పాండ్య అందుబాటులో ఉండకపోవడం దెబ్బ. పేసర్ బుమ్రా, స్పిన్ లో జడేజా, కుల్దీప్ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. సిరాజ్ పరుగులు ఇస్తున్నా.. కీలక సమయంలో వికెట్లు పడగొట్టగల సత్తా అతడి సొంతం. వీరంతా తలో చేయి వేస్తే కివీస్ ను పడగొట్టడం చాలా తేలిక.

ఐసీసీ టోర్నీల్లో గెలిచి 20 ఏళ్లు కాన్వే, యంగ్, రచిన్ రవీంద్ర, మిచెల్, లాథమ్, ఫిలిప్స్‌.. ఇదీ న్యూజిలాండ్ బ్యాటింగ్ బలం. చాప్‌ మన్‌ విధ్వంసం రేపగలడు. శాంట్నర్‌ స్పిన్ ను ఎదుర్కొనడం సవాలే. హెన్రీ, ఫెర్గూసన్‌ పేస్ కొరుకుడుపడనిదే. బౌల్ట్ ఎప్పుడూ ప్రమాదకార. కాగా, 2003 ప్రపంచ కప్‌ లో చివరిసారిగా కివీస్‌ను మన జట్టు ఓడించింది. 146కే ఆలౌట్‌ చేసిన భారత్.. ఈ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 56 బంతులు మిగిలుండగా ఛేదించింది. 2007, 2016 టి20 ప్రపంచ కప్ లు , 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్, 2021లో టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్.. ఇలా ప్రతిసారీ మన జట్టును న్యూజిలాండ్ ఓడించింది.

ఇప్పుడే కొట్టాలి..న్యూజిలాండ్ ఆల్ రౌండ్ జట్టు. ఎప్పుడూ ప్రమాదకారే. అందుకనే ఆ జట్టును లీగ్ దశలోనే కొట్టాలి. టోర్నీలో ముందుకుసాగేకొద్దీ ఈ ఫలితం ప్రభావం ఉంటుంది. సెమీస్ లో మనకు ఎదురుపడకూడదని భావించినా.. ఫైనల్ కు ముందే నైతికంగా దెబ్బతీయాలని అనుకున్నా.. లీగ్ దశలోనే న్యూజిలాండ్ తోక కత్తిరించాలి. రేపటి మ్యాచ్ లో అదే జరుగుద్దని ఆశిద్దాం.

Tags:    

Similar News