హైదరాబాద్- విజయవాడ హైవే తాజా పరిస్థితి ఇదే!
ప్రస్తుతం మున్నేరుకు 1,92,000 క్యూసెక్కుల వరద వస్తోంది. వరద ఇంకా పెరుగుతుందనే అంచనాతో అధికారుల అప్రమత్తమయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రైల్వే ట్రాకులు, బ్రిడ్జిలు, రోడ్లు నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం మూతపడిన హైదరాబాద్ - విజయవాడ హైవే... శుక్రవారం ఉదయం వరకూ అలానే ఉందని తెలుస్తోంది.
అవును... జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నందిగామ మండలం ఐతవరంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై వరదనీరు భారీగా చేరింది. ఇలా హైవేపైకి వరద నీరు రావడంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో... కీసర టోల్ గేట్ నుంచి విజయవాడ వైపు సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
దీంతో పోలీసులు చేరుకొని వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నారు. మున్నేరు వాగు ఉప్పొంగినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టూ వీలర్స్, ఫోర్ వీలర్ వాహనాలు అటువైపు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ వెళ్లే ప్రయాణికులు వేరే మార్గాలు ద్వారా వెళ్లాలని సూచిస్తున్నారు.
ఇదే సమయంలో... హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనదారులు../ నార్కట్ పల్లి - మిర్యాలగూడ - దాచేపల్లి - పిడుగురాళ్ల - సత్తెనపల్లి - గుంటూరు-విజయవాడ- ఏలూరు - రాజమండ్రి మీదుగా వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో... విజయవాడ నుంచి వెళ్లే వాహనాలను పోలీసులు దారిమళ్లిస్తున్నారు. ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి మైలవరం, తిరువూరు, మీదుగా కోదాడ వెళ్లేలా వాహనాలను మళ్లిస్తున్నారు.
ప్రస్తుతం మున్నేరుకు 1,92,000 క్యూసెక్కుల వరద వస్తోంది. వరద ఇంకా పెరుగుతుందనే అంచనాతో అధికారుల అప్రమత్తమయ్యారు. హైవేపై వాహనాలను పలుమార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఐతవరం గ్రామం వద్ద బస్సులు, ఇతర పెద్ద వాహనాలు అక్కడే ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
2008 తర్వాత ఈ ఏడాదే ఈ స్థాయిలో వరద నీరు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, గురువారంతో పోల్చితే శుక్రవారం 10 మీటర్లు మేర హైవే పై నీటి ప్రవాహం పెరిగినట్టు చెబుతున్నారు. శనివారం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా... ఏదైనా సమాచారం కోసం విజయవాడ నగర పోలీస్ కంట్రోల్ రూమ్ 73289 09090 నంబర్ కు సంప్రదించాలని పోలీసులు సూచించారు.