హైదరాబాద్ లో లగ్జరీ కార్ల రేసింగ్.. నాలుగు హైఎండ్ కార్లు స్వాధీనం!
పబ్లిక్ రోడ్లపై లగ్జరీ కార్లను రేసింగ్
హైదరాబాద్ లో అర్ధరాత్రుల్లు సిటీలోనూ, పగలు సమయాల్లో సిటీ అవుట్ కట్స్ లోనూ కార్ రేస్ లు, బైక్ రేస్ లూ జరుగుతున్నాయంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వీటిని అరికట్టడానికి పోలీసులు నిత్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో హైఎండ్ లగ్జరీ కార్లతో కొంతమంది రేసింగ్ లో పాల్గొన్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారని తెలుస్తుంది. విచారణలో భాగంగా కార్లను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది.
అవును... హైదరాబాద్ లోని కోకాపేట్ గ్రామంలోని మూవీ టవర్స్ రోడ్స్ లో జరిగిన రేసింగ్ లో లంబోర్గినీ, ఫెరారీ, ఆడి, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లు, రెండు ఇన్నోవాలు పాల్గొన్నాయని తెలుస్తుంది. ఈ ఘటనపై నార్సింగ్ పోలీసులు సత్వరమే స్పందించి రేసింగ్ లకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో వీటిలో కొన్ని లగ్జరీ కార్ల నెంబర్ ప్లేట్స్ అన్నీ ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఉన్నాయని అంటున్నారు. దీంతో... ఈ వాహనాల యజమానులు హైదరాబాద్ లో నివసిస్తుండగా.. తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే విషయంపై కూడా పోలీసులు దృష్టి సారించారని తెలుస్తుంది.
పబ్లిక్ రోడ్లపై లగ్జరీ కార్లను రేసింగ్ చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా ప్రజల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుందనేది కామన్ సెన్స్ పాయింట్. అటువంటి కార్యకలాపాలలో మునిగిపోయే వ్యక్తులు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఇదే సమయంలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రధాన కారణం అని గ్రహించాలని పోలీసులు సూచిస్తున్నారు!
అయితే ఈ ఘటన జూలై 14న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది.