ఇంకా దేవాల‌యాల్లో మ‌త వివ‌క్ష‌.. మంట పెట్టిన పాల్!

Update: 2023-01-18 08:35 GMT
దేవాల‌యంలోకి మ‌త ప్రాతిపాదిక‌న ప్ర‌వేశమా?.. నేటి జ‌న‌రేష‌న్ లో ఇది విచిత్ర‌మైన స‌మ‌స్య‌నే. కానీ మత వివక్ష కారణంగా కేరళ- ఎర్నాకులంలోని తిరువైరానికులం మహాదేవ ఆలయంలోకి ప్రవేశించడానికి అధికారులు తనకు అనుమతి నిరాకరించారని సినీ న‌టి అమలా పాల్ ఆరోపించారు. దేవాల‌య ప్రాంగణంలోనికి హిందువులను మాత్రమే అనుమతించే ఆచారాలను ఉటంకిస్తూ ఆలయ అధికారులను స‌ద‌రు క‌థానాయిక విమ‌ర్శించారు. ఆల‌య అధికారులు త‌న‌కు దైవ‌ దర్శనం నిరాకరించినట్లు తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

సోమవారం నాడు అమ‌లాపాల్ ఆలయాన్ని సందర్శించాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ తనకు దైవ దర్శనం నిరాకరించ‌డంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆలయం ముందు ఉన్న రహదారిలోనే నిల‌బ‌డి అమ్మవారి దర్శనం చేసుకోమని బలవంతం చేశారని కూడా అమ‌లాపాల్ ఆరోపించారు.

ఆలయ సందర్శకుల రిజిస్టర్ లో అమలా పాల్ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ''తాను అమ్మవారిని చూడకపోయినా ఆత్మను సంద‌ర్శించాన‌ని అనుభవించాన''ని అమ‌లాపాల్ త‌న నిజ‌మైన‌ భ‌క్తిని చాటుకున్నారు. 2023లో ప్ర‌వేశించాం.. ఈ ఆధునిక డిజిట‌ల్ స‌మాజంలోనూ  ఇంకా మతపరమైన వివక్ష కొనసాగడం విచారకరమ‌ని పాల్ నిరాశను వ్య‌క్తం చేసారు. నేను దేవత దగ్గరికి వెళ్లలేకపోయాను కానీ దూరం నుండి ఆత్మను అనుభవించగలిగాను.

త్వరలో మతపరమైన వివక్షలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ''సమయం వస్తుంది.. మనల్ని అంద‌రినీ మతం ప్రాతిపదికన కాకుండా సమానంగా చూస్తారు'' అని అమలా పాల్ ప్ర‌త్యేకంగా ఆలయ సందర్శకుల రిజిస్టర్ లో రాశారు.

ఈ అనూహ్య‌ ఘటన వెలుగులోకి రావ‌డంతో తిరువైరానికుళం మహాదేవ ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలోని ఆలయ నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు. అయితే ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం... తాము ఇప్పటికే ఉన్న ప్రోటోకాల్ ను మాత్రమే అనుస‌రిస్తున్నామని ఆలయ అధికారులు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారని తెలిసింది.

ఇతర మతాలకు చెందిన భక్తులు చాలా మంది ఆలయాన్ని సందర్శించేందుకు వస్తున్నారని అయితే ఆ విషయం ఎవరికీ తెలియదని అయితే ఎవ‌రైనా సెల‌బ్రిటీ లేదా ప్ర‌ముఖులు ఆల‌యానికి వస్తేనే అది వివాదాస్పదం అవుతోందని ట్రస్ట్ కార్యదర్శి ప్రసూన్ కుమార్ సెటైర్ వేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News