డైరెక్ట‌ర్‌ ఇంటి ముందు నిర్మాత ధ‌ర్నా!

Update: 2022-09-15 08:37 GMT
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ద‌ర్శ‌కుడు బాల మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. విక్ర‌మ్‌, సూర్య‌ల‌తో 'శివ‌పుత్రుడు'('పితామ‌గ‌న్‌'), సూర్య హీరోగా 'నంద‌' వంటి విభిన్న‌మైన సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా తిరుగులేని గుర్తింపుని సొంతం చేసుకున్నారు. 'అర్జున్ రెడ్డి' త‌మిళ రీమేక్ 'ఆదిత్య వ‌ర్మ‌' కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన బాల తాజాగా మ‌రో సారి వివాదంలో ఇరుక్కున్నారు. త‌ను రూపొందించిన 'పితామ‌గ‌న్‌' తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

ఈ మూవీని వీఏ దురై నిర్మించారు. ఈ సినిమాతో విక్ర‌మ్ కు జాతీయ పుర‌స్కారం ల‌భించిన విష‌యం తెలిసిందే. అవార్డుల్ని తెచ్చిపెట్టిన ఈ మూవీ నిర్మాత‌కు లాభాల్ని మాత్రం తెచ్చిపెట్ట‌లేద‌ట‌. దీంతో నిర్మాత వీఏ దురై కి మ‌రో సినిమా చేసిపెడ‌తాన‌ని ద‌ర్శ‌కుడు బాల అప్పుడే మాటిచ్చార‌ట‌. ఆ మాట తీసుకున్న నిర్మాత బాల‌కు అడ్వాన్స్ గా రూ. 10 ల‌క్ష‌లు ఇచ్చార‌ట‌. అయితే అప్ప‌టి నుంచి అడ్వాన్స్ తీసుకున్న ద‌ర్శ‌కుడు బాల ఏళ్లు గ‌డుస్తున్నా నిర్మాత వీఏ దురై కి సినిమా మాత్రం చేసిపెట్ట‌లేద‌ట‌.

అంతే కాకుండా తీసుకున్న అడ్వాన్స్ రూ. 10 ల‌క్ష‌లు నిర్మాతకు తిరిగి చెల్లించ‌క‌పోగా అత‌నికి బాల స‌మాధానం కూడా చెప్ప‌డం లేద‌ని, ఇలా ఏళ్లు గ‌డిచిపోతున్నా త‌న‌కు సినిమా చేయ‌డం లేదు. పోనీ ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వ‌డం లేద‌ని ఆగ్ర‌హించిన నిర్మాత మంగ‌ళ‌వారం చెన్నైలోని బాల కార్యాల‌యానికి వ‌చ్చి త‌ను ఇచ్చిన అడ్వాన్స్ రూ. 10 ల‌క్ష‌లు తిరిగి చెల్లించాల్సిందిగా నిల‌దీశాడ‌ట‌. దీంతో బాల అనుచ‌రుడు నిర్మాత వీఏ దురైని కార్యాల‌యం నుంచి బ‌య‌టికి నెట్టేశాడ‌ట‌.

విష‌యం సీరియ‌స్ కావ‌డంతో ఆగ్ర‌హించిన నిర్మాత వీఏ దురై బాలా కార్యాల‌యం ముందు ధ‌ర్నాకు దిగ‌డం ఇప్ప‌డు కోలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే విష‌యం తెలుసుకున్న నిర్మాత‌ల మండ‌లి స‌భ్యులు వీఏ దురైకి ఫోన్ చేసి స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చార‌ట‌.

దీంతో నిర్మాత వీఏ దురై అక్క‌డి నుంచి వెళ్లిపోయిన‌ట్టుగా చెబుతున్నారు. నిర్మాత‌గా క‌ష్టాల్లో వున్న వీఏ దురై ప్ర‌స్తుతం న‌టుడిగా కొన‌సాగుతున్నాడు. ఓ సినిమాలో విల‌న్ గా ఆయ‌న న‌టిస్తున్నార‌ట‌.

ఇదిలా వుంటే బాల 20 ఏళ్ల సుధీర్ఘ విరామం త‌రువాత హీరో సూర్య‌తో క‌లిసి 'వ‌నాంగ‌న్‌' పేరుతో ఓ మాసీవ్ యాక్ష‌న్ మూవీని చేస్తున్నాడు. ఇదే సినిమాని తెలుగులో 'అచ‌లుడు' పేరుతో రిలీజ్ చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తున్నఈ మూవీని 2డీ ఎంట‌ర్ టైన్ మెంట్‌ బ్యాన‌ర్ పై హీరో సూర్య స్వ‌యంగా నిర్మిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News