క్రేజ్ లేని స్టార్ల‌తో CCL ట్రోఫీకి ఆద‌ర‌ణ ఎలా?

Update: 2023-02-13 10:18 GMT
టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అగ్ర‌ హీరోలు ఒక గొడుగు కిందికి వ‌చ్చి క్రికెట్ ఆడుతుంటే ఎంతో ఆస‌క్తిగా ఉండేది. సౌత్ - నార్త్ స్టార్ల క‌ల‌యిక‌లో క్రికెట్ ఆట దేశ‌వ్యాప్తంగా క్రేజుతో కొన‌సాగే వీలుండేది.  అభిమానులు క్రేజీగా ఫీల‌యితే సాధార‌ణ జ‌నాలు కూడా టీవీల్లో ఆస‌క్తిగా చూసేవారు. అంద‌రూ క్రేజున్న‌ హీరోలు ఆట వ‌చ్చినా రాక‌పోయినా ఆడితే ఆ అందం వేరుగా ఉండేది. పైగా ఇంత‌కుముందు సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) వంటివి ఏదైనా కాజ్ కోసం సెల‌బ్రిటీల‌తో క్రికెట్ ఆడించేవి. ఏదైనా ప్ర‌జ‌ల‌కు క‌ష్టం వ‌స్తే వారిని ఆదుకునే కాజ్ కోసం ఇలాంటి ట్రోఫీని నిర్వ‌హించేవారు. స్పాన్సర్స్ సాయంతో కొంత డ‌బ్బు వ‌స్తే ప్ర‌జ‌ల‌ను క‌ష్టంలో ఆదుకునేందుకు ఉప‌యోగ‌ప‌డేది. తుఫాన్ లు ప్ర‌కృతి భీభ‌త్సాలు లేదా విల‌యాలు సంభ‌వించిన అనంత‌రం ఇలాంటి స్పెష‌ల్ ట్రీట్ తో అవ‌స‌ర‌మైన నిధి సేక‌ర‌ణ సులువు అయ్యేది.

కానీ సీసీఎల్ పంథా రాను రాను మారుతూ వ‌చ్చింది. స్టార్ల‌తో క్రికెట్ ఆట తీరు మారింది. హీరోల్లో చిన్న చిన్న హీరోల‌ను క్రేజు లేని హీరోల‌ను ఎంపిక చేసుకుని.. వారిని కొంద‌రు క్రికెట‌ర్ల‌తో క‌లిపి ఆట ఆడించ‌డం అనే విధానం ప్ర‌జ‌ల్లో ఏమంత‌గా క‌నెక్ట్ కాలేదు. కుర్ర హీరోలకు అంత‌గా ప్ర‌జ‌ల్లో ఇమేజ్ లేక‌పోయినా క్రేజు తో ప‌ని లేకుండా అంతో ఇంతో ఆట వ‌స్తేనే ఎంపిక చేయ‌డం అనేది స‌రైన ఆలోచ‌న‌గా క‌నిపించ‌డం లేదు. దీనివ‌ల్ల సీసీఎల్ పై జ‌నాల్లో ఆస‌క్తి సన్న‌గిల్లి పోయింది.

నేరుగా స్టార్ క్రికెట‌ర్ల‌తో సిక్స‌ర్లు ఫోర్లు అంటూ రంజింప‌జేసే ఐపీఎల్ లాంటి ఫేవ‌రెట్ గేమ్ పైనే ఇటీవ‌ల ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి త‌గ్గింది. ఇప్పుడు ఐపీఎల్ అంతా రొటీన్ అయిపోయింది. ఈ బిజీ లైఫ్ లో గంద‌ర‌గోళ జీవన విధానంలో గంట‌ల కొద్దీ స‌మ‌యం వెచ్చించి టీవీల‌కు అతుక్కునేందుకు ఎవ‌రూ సిద్ధంగా లేరు.

ఇలా మారిన ట్రెండ్ లో ఇప్పుడు సెల‌బ్రిటీల ట్రోఫీ సీసీఎల్ కి ఆద‌ర‌ణ ద‌క్కాలంటే ఎవ‌రైన ప్ర‌జ‌ల్లో క్రేజ్ ఉన్న స్టార్లతో ముందుకు వ‌స్తేనే జ‌నాద‌ర‌ణ ద‌క్కే వీలుంటుంది కానీ... ఎవ‌రో ఒక అనామ‌క హీరో అంత‌గా జ‌నాల్లోకి వెళ్లని హీరోలు ఆడుతున్నారంటే క్రికెట్ ని గంట‌ల కొద్దీ స‌మ‌యం వెచ్చించి వీక్షించేందుకు ప్ర‌జ‌లు స్టేడియం వ‌ర‌కూ రావాలి క‌దా? అని కొంద‌రు విశ్లేష‌కులు సందేహిస్తున్నారు. అయితే ఇలా కాకుండా మునుప‌టిలా టాలీవుడ్ - బాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌ముఖ‌ స్టార్ల‌ను క‌లుపుకుంటూ సీసీఎల్ నిర్వ‌హిస్తే దానికి జ‌నాద‌ర‌ణ బావుంటుంద‌ని విశ్లేషిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - వెంక‌టేష్‌- నాగార్జున‌- బాల‌కృష్ణ‌- మోహ‌న్ లాల్- అజిత్ - విజ‌య్ - మ‌హేష్ - రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ - ప్ర‌భాస్ - సూర్య‌- కార్తీ- అఖిల్ - నాగ‌చైత‌న్య‌- నిఖిల్ లాంటి హీరోలు క్రికెట్ ఆడుతున్నారంటే వారికి ఆడ‌టం వ‌చ్చినా రాక‌పోయినా స‌ర‌దాగా వీక్షించేందుకు అభిమానులు ముందుకు వ‌స్తారు కానీ మ‌రీ అంత‌గా ముఖ ప‌రిచ‌యం లేని కుర్ర‌హీరోలు ఆద‌ర‌ణ లేని హీరోల‌తో సీసీఎల్ ని లాగించేస్తామంటే జ‌నంలో క్రేజ్ ఉండాలి క‌దా? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. మునుముందు సీసీఎల్ తీరు మారుతుంద‌నే ఆశిద్దాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News