మినీ రివ్యూ: 'రైటర్'

Update: 2022-06-06 10:42 GMT
తెలుగు డిజిటల్ వేదిక 'ఆహా' ఓటీటీ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను వీక్షకులకు అందించడానికి కృషి చేస్తోంది. ప్రతీవారం సూపర్ హిట్ చిత్రాలు - ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ పెడుతోంది. ఈ క్రమంలో లేటెస్టుగా "రైటర్" అనే తమిళ్ డబ్బింగ్ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

'రైటర్' చిత్రాన్ని కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పా. రంజిత్ నిర్మించగా.. ప్రాంక్లిన్ జాకబ్ దర్శకత్వం వహించారు. ఇందులో విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషించారు. గతేడాది తమిళంలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటుగా మంచి వసూళ్ళు సాధించింది. ఇప్పుడు 'ఆహా' ఓటిటి వేదికగా అదే పేరుతో తెలుగులో స్టీమింగ్ అవుతోంది.

కథ విషయానికొస్తే.. అమలాపురంలోని ఓ పోలీస్ స్టేషన్ లో రైటర్ పనిచేస్తుంటాడు రంగరాజు (సముద్రఖని). పోలీసు వ్యవస్థలో కిందిస్థాయి ఉద్యోగులకు కూడా ఉన్నతాధికారుల మాదిరిగానే ఒక యూనియన్ ఉండాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తుంటాడు. ఈ వ్యవహారం నచ్చని ఆఫీసర్ అతన్ని విశాఖపట్నంలోని మరో పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తాడు.

రిటైర్మెంట్ కు ఇంక రెండు నెలలు మాత్రమే ఉండటంతో ఎలాగో నెట్టుకొచ్చేద్దామని విశాఖకు వెళతాడు రంగరాజు. అదే సమయంలో దేవకుమార్ (హరి కృష్ణన్) అనే పీహెచ్ స్టూడెంట్ ను ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ అదుపులోకి తీసుకుని ఓ లాడ్జిలో పెట్టి విచారిస్తుంటాడు. ఆ యువకుడు తప్పించుపోకుండా చూసే బాధ్యతను కానిస్టేబుల్ రంగరాజుకు అప్పగిస్తారు.

దేవ కుమార్ ను పోలీస్ స్టేషన్ లో కాకుండా రహస్యంగా ఎందుకు విచారిస్తున్నారు? ఈ కేసు ఏమిటి? రంగరాజు కారణంగా దేవకుమార్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు రంగరాజు తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అసలు ఏం జరిగింది? అనేదే ''రైటర్'' సినిమా మిగతా కథ.

తెలుగుతో పోలిస్తే తమిళ మలయాళ ఇండస్ట్రీలలో ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువగా తెరకెక్కుతుంటాయి. ఇలాంటి సినిమాల్లో నటించాడని స్టార్ హీరోలు సైతం రెడీగా ఉంటారు. కమర్షియల్ హంగులకు దూరంగా కథే పరమావధిగా రూపొందిస్తుంటారు. 'కబాలి' 'కాలా' 'సార్పట్టా' చిత్రాలలో వర్ణ వివక్ష గురించి ప్రస్తావించిన దర్శకుడు పా. రంజిత్.. నిర్మాతగానూ 'పెరియారుమ్ పెరిమాల్' వంటి సినిమాల్లో కాస్ట్ ఫీలింగ్ గురించి చూపించారు.

ఇప్పుడు 'రైటర్' సినిమాలో పోలీస్ వ్యవస్థలో వర్ణ వివక్ష గురించి అంతర్లీనంగా చూపించే ప్రయత్నం చేశారు. పోలీస్ వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించారు. తమ కంటే ర్యాంకు తక్కువ ఉన్న ఉద్యోగుల పట్ల ఉన్నతాధికారులు వ్యవహరించే తీరు.. ఉద్యోగంలో కులాల ప్రస్తావన ఇలా ఒక్కో అంశాన్ని టచ్ చేశారు.

క్రైమ్ రేట్ తగ్గించడం కోసం పోలీసులు కేసులను ఏ విధంగా పరిష్కరిస్తారు? ఎటువంటి నేరం చేయని వాళ్ళను అన్యాయంగా కేసుల్లో ఎలా ఇరికిస్తారు? అనే అంశాలను ప్రస్తావించారు. ఒక వ్యక్తి తన వల్ల అన్యాయంగా కేసులో ఇరుకున్నాడని పశ్చాత్తాపంతో బాధపడే ఒక పోలీస్ మనోవేదనను ఎమోషనల్ గా చూపించారు.

రంగరాజు రాజు పాత్రలో సముద్రఖని జీవించారు. ఇద్దరు భార్యలకు భర్తగా.. పదవీ విరమణకు దగ్గరపడిన పోలీసు ఉద్యోగిగా ఆయన నటన అద్భుతంగా ఉంది. తప్పు చేశామన్న భావనతో తీవ్రంగా మదనపడే సన్నివేశాల్లో ఆయన నటన హైలైట్ అని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు సముద్ర ఖని ఒక్కరే ఈ సినిమాలో ఉండటంతో అందరికీ ఆయన పాత్రే గుర్తుండి పోతుంది. హరి కృష్ణన్ - ఇనియా సహా మిగిలిన నటీనటులు కూడా ఆకట్టుకున్నారు.

దర్శకుడు ఎంచుకున్న పాయింట్ 'రైటర్' సినిమాకు ప్రధాన బలం. దాన్ని తెరపై చూపించటంలో సఫలమయ్యారు. కథకు భావోద్వేగాలను జోడించి, హృదయానికి హత్తుకునేలా చూపించే ప్రయత్నం చేశారు. కాకపోతే సినిమా నిడివి తగ్గించి.. మరీ సాగతీతగా ఉన్న సీన్లను ట్రిమ్ చేసి.. అసలు పాయింట్ మీదనే దృష్టి పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది.

సాంకేతిక బృందం పనితీరును కచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. గోవింద్ వసంత నేపథ్య సంగీతం కథతో పాటు ప్రయాణించిందని చెప్పాలి. ప్రదీప్ కాళిరాజా సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మణికందన్ ఎడిటింగ్ కు ఇంకాస్త పని చెప్పాల్సింది. తమిళ నేటివిటీకి ఓకే అయ్యుండొచ్చు కానీ.. తెలుగులో చూడటానికి మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించింది.

మొత్తం మీద రెగ్యులర్ పోలీస్ కథలకు భిన్నంగా రూపొందిన సినిమా 'రైటర్'. సహజత్వానికి దగ్గరగా తీశారు. 'నాంది' 'విసరణై' 'నాయత్తు' వంటి డిఫరెంట్ క్లైమ్ థ్రిల్లర్స్ చూడాలనుకునేవారు ఈ మూవీని కచ్చితంగా ఇష్టపడతారు. సముద్రఖని అభినయానికి ఫిదా అవుతారు. స్లోగా ఉన్నప్పటికీ ఓటీటీలో కాబట్టి అలాంటి సన్నివేశాలను ఫార్వార్డ్ చేసుకుంటూ చూసెయ్యెచ్చు.
Tags:    

Similar News