ఇప్పుడు మెగా బ్రదర్ హ్యాపీ

Update: 2018-02-28 05:01 GMT
సినిమా ఇండస్ట్రీలో హిట్టు.. ఫ్లాపులు సహజమే. హిట్లు వచ్చినప్పుడు అంతా హ్యాపీయే. ఇంకో సినిమా చేసే జోష్ వస్తుంది. అదే ఫ్లాప్ గానీ ఎదురైందంటే కష్టనష్టాలు చుట్టుముట్టినట్టే. కొన్నికొన్ని సినిమాలు డిజాస్టర్లు కూడా అవడం మామూలే. అలాంటప్పుడు ఎంత పేరుమోసిన నిర్మాతలైనా దాదాపుగా వీధినపడే పరిస్థితి వస్తుంది. అయినవాళ్ల సపోర్ట్ ఉంటే ఈ పరిస్థితిని దాటే వీలుంటుంది. కాలం చేసే చమత్కారమూ చూసే వీలుంటుంది.

మెగా ఫ్యామిలీలో నాగబాబుకు ఇలాంటి అనుభవమే ఉంది. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ తరవాత రామ్ చరణ్ తేజ్ తో ఆరెంజ్ సినిమా నిర్మించాడు నాగబాబు. బొమ్మరిల్లుతో సూపర్ సక్సెస్ సాధించిన డైరెక్టర్ భాస్కర్ కావడంతో ఆ సినిమాకు కోట్లల్లో పెట్టుబడి పెట్టాడు. తీరా సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ టైంలో నాగబాబు బంధువు కూడా మోసం చేశాడు. చుట్టుముట్టిన అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచన కూడా చేశానని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గానే చెప్పాడు. ఆ టైంలో అతడి తమ్ముడు.. పవర్ స్టార్ పవన్ రూ. 3 కోట్లు సహాయంగా ఇవ్వడం... మరోవైపు చిరంజీవి నుంచి ఇతరత్రా సపోర్ట్ లభించడంతో అప్పులబాధ నుంచి బయటపడ్డాడని అంటారు.

మాటీవీ పెట్టిన కొత్తలో నాగబాబు తన అన్న చిరంజీవి సలహా మేరకు కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి చిన్న వాటా తీసుకున్నాడు. ఈ మధ్య స్టార్ టీవీ మాను కొనేసింది. ఈ డీల్ లో నాగబాబు వాటాకింద రూ. 39 కోట్లు వెనక్కి వచ్చాయని తెలిసింది. దీంతో నాగబాబు తమ్ముడు కళ్యాణ్ డబ్బు వెనక్కి ఇవ్వడమే కాదు.. లైఫ్ లో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. మరోవైపు కొడుకు వరుణ్ తేజ్ కెరీర్ సక్సెస్ బాట పట్టడం.. కూతురు నీహారికకు మంచిపేరు రావడంతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. కలిసుంటే కలదు లాభం అని చెప్పడానికి మెగా బ్రదర్స్ జీవితంలోని ఈ ఇన్సిడెంట్ ఉదాహరణగా సరిపోతుందేమో



Tags:    

Similar News