‘హత్య’ సినిమా వివాదమేంటి? మళ్లీ కేసులు.. ఏం జరిగింది?

‘హత్య’ సినిమా వివాదాలకు కేరాఫ్ గా మారింది. ఆ సినిమా మొదలైనప్పటి నుంచి విడుదలయ్యే వరకూ వివాదాలు వీడలేదు.;

Update: 2025-03-22 06:54 GMT

‘హత్య’ సినిమా వివాదాలకు కేరాఫ్ గా మారింది. ఆ సినిమా మొదలైనప్పటి నుంచి విడుదలయ్యే వరకూ వివాదాలు వీడలేదు. తాజాగా ఈ సినిమాలోని సన్నివేశాలపై ఐదుగురిపై కేసు నమోదు కావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. తనను , తన తల్లిని ‘హత్య’ సినిమాలో క్రూరంగా చిత్రీకరించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పులివెందుల పోలీసులు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయితతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.

సునీల్‌ యాదవ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ‘వైఎస్‌ అవినాష్‌ అన్న యూత్‌’ అనే వాట్సప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ పవన్‌ కుమార్‌ను ఏ1గా పేర్కొన్నారు. ఈ గ్రూప్‌లో ‘హత్య’ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను పవన్‌ కుమార్‌ వైరల్‌ చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. అలాగే, వైకాపా సోషల్‌ మీడియా కడప అడ్మిన్‌ను ఏ2గా పేర్కొన్నారు.

తన ఇంటి వద్ద కొందరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని కూడా సునీల్‌ యాదవ్‌ ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) ,ఐటీ యాక్ట్ 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా, తనకు ప్రాణహాని ఉందని సునీల్‌ యాదవ్‌ రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదులోనూ ఆయన ‘హత్య’ సినిమా గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

-హత్య సినిమా కథ ఏమిటి? ఆ వివాదం ఏంటంటే?

శ్రీవిద్య బసవ దర్శకత్వంలో ధన్య బాలకృష్ణ, రవి వర్మ, పూజా రామచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'హత్య'. ఈ సినిమా జనవరి 24, 2025న విడుదలైంది. విడుదలైన నాటి నుండి ఈ చిత్రం పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా ఈ సినిమా కథాంశం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఒక రాజకీయ హత్యను పోలి ఉండటంతో దుమారం రేగింది.

ఈ కథాంశం 2019లో జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును గుర్తుకు తెస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో పాత్రల పేర్లు, సంఘటనలు నిజ జీవితంలోని వ్యక్తులు, ఘటనలను పోలి ఉండటంతో ఈ సినిమా వివాదాస్పదంగా మారింది. దర్శకురాలు శ్రీవిద్య బసవ ఇది కేవలం కల్పిత కథ అని చెబుతున్నప్పటికీ ఇందులో పాత్రలను పోలిన వారు పోలీస్ స్టేషన్ గడప తొక్కుతూ విమర్శలు చేస్తున్నారు.

'హత్య' సినిమా విడుదల కాకముందు నుంచే దాని కథాంశంపై అనేక ఊహాగానాలు, వివాదాలు నెలకొన్నాయి. సినిమా విడుదల తర్వాత కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

Tags:    

Similar News