టాలీవుడ్ పై అసూయగా ఉంది
ఆ సినిమా తర్వాత పలు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కి సక్సెస్ ను సాధించి, దేశమంతటా క్రేజ్ ను తెచ్చుకున్నాయి.;
ఒకప్పుడు తెలుగన్నా, తెలుగు సినిమాలన్నా మిగిలిన భాషల వాళ్లు చాలా చులకనగా చూసేవాళ్లు. కానీ కొంతకాలంగా తెలుగు సినిమాల క్రేజ్ బాగా పెరిగింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా తన సత్తాను చాటింది. ఆ సినిమా తర్వాత పలు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కి సక్సెస్ ను సాధించి, దేశమంతటా క్రేజ్ ను తెచ్చుకున్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప2 సినిమాలు దేశం మొత్తాన్ని షేక్ చేసి, బాక్సాఫీస్ ను ఏలిన సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సంగతి చెప్పనక్కర్లేదు. ఆ సినిమా సృష్టించిన సంచలనాలు, క్రియేట్ చేసిన రికార్డులు మామూలువి కావు. ఆస్కార్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన సినిమాగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది.
దీంతో తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగింది. హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఆర్ఆర్ఆర్ ను మెచ్చుకున్నారంటే తెలుగు సినిమా క్రేజ్ ను, దాని స్థాయిని అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ క్రేజ్ బాగా పెరిగిన నేపథ్యంలో మిగిలిన భాషల నిర్మాతలు, ఇతర ఇండస్ట్రీల స్టార్ హీరోల కన్ను కూడా తెలుగు చిత్ర పరిశ్రమపై పడింది.
అయితే బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, పుష్ప2 లాంటి సినిమాలే కాదు, టాలీవుడ్ లోని చిన్న సినిమాలు కూడా భారీ సక్సెస్ లు అందుకుంటున్నాయి. బలగం, మ్యాడ్, డీజే టిల్లు, టిల్లూ స్వ్కేర్, రీసెంట్ గా కోర్టు లాంటి సినిమాలు కూడా తక్కువ బడ్జెట్ లతో రూపొంది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పై తనకు అసూయగా ఉందని కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అన్నారు.
అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన వీర ధీర శూర పార్ట్2 మార్చి 27న రిలీజవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొని టాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో భారీ కమర్షియల్ సినిమాలు బ్లాక్ బస్టర్ అవడంతో పాటూ చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లవుతున్నాయని, తమిళ పరిశ్రమలో కూడా అలాంటి సినిమాలు రావాలని, దానిపైనే కోలీవుడ్ వర్క్ చేస్తుందని విక్రమ్ అన్నారు. మంచి కంటెంట్ ను తెలుగు ప్రేక్షకలు ఎప్పుడూ ఆదరిస్తారని, ఆర్టిస్టులుగా తమకు కావాల్సింది కూడా అదేనని, వీర ధీర శూర పార్ట్2 మంచి సినిమా మాత్రమే కాదు, ఎంటర్టైనింగ్ ఫిల్మ్ కూడా అని విక్రమ్ తెలిపారు.