కొణిదెల గ్రామం.. ఇంటి పేరుకు గౌరవం పెంచిన పవన్ కల్యాణ్
ఊదరగొట్టుడు ప్రచారం చేసుకోకుండా తాము చేసిన సాయాన్ని ఆరోజు బయటకు చెప్పాల్సి వచ్చింది.;
సెలబ్రిటీలు గ్రామాల్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలనే ఇనిషియేషన్ ఎంతో గొప్పది. మెగాస్టార్ చిరంజీవి తన సొంత ఊరు మొగల్తూరుకు ఏమీ చేయలేదని ఒక సెక్షన్ మీడియా కథనాలు ప్రచురించాక, మెగాస్టార్ స్వయంగా దానిని ఖండిస్తూ, తాను తన కుటుంబం ఆ గ్రామానికి ఏం చేసిందో వెల్లడించారు. ఊదరగొట్టుడు ప్రచారం చేసుకోకుండా తాము చేసిన సాయాన్ని ఆరోజు బయటకు చెప్పాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే, ఈ రోజు కేవలం `కొణిదెల` అనే పేరు ఉన్నందున, తనకు కానీ తన కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేని ఒక గ్రామానికి పవన్ కల్యాణ్ 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం, తాను దత్తత తీసుకుని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మాటివ్వడం చర్చనీయాంశమైంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఈ గ్రామంలో జన్మించలేదు. కానీ వారి ఇంటి పేరు ఈ గ్రామానికి ఉండడం పెద్ద అర్హతగా మారింది. అది ఇప్పుడు ఏకంగా ఆ విలేజీకి 50 లక్షల గ్రాంట్ ని అందిస్తోంది. అంతేకాదు.. ఈ యాభై లక్షలు తన ట్రస్ట్ సాయం చేస్తుందని, ఇంకా ఆ గ్రామానికి, నియోజకవర్గానికి ఏవైనా సమస్యలు ఉంటే చెబితే వాటిని కూడా పరిష్కరిస్తానని ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటిచ్చారు.
పవన్ తాజా ప్రకటన `కొణిదెల` బ్రాండ్ మార్మోగేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో `కొణిదెల` అనే చిన్న గ్రామానికి ఇప్పుడు మహర్ధశ పట్టబోతోంది. ఉమ్మడి కర్నూల్ జిల్లా పర్యటనలో ఉన్న పవన్ అనూహ్యంగా ఆ గ్రామానికి వరం ఇచ్చారు. కర్నూలు- పూడిచర్లలో ఫాం పాండ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ `కొణిదెల` గ్రామం గురించి ప్రస్తావిస్తూ.. నందికొట్కూరు ఎమ్మెల్యే కొణిదెల గ్రామం గురించి చెప్పారని తెలిపారు. ఆ గ్రామ అభివృద్ధి గురించి కోరగా, దత్తత తీసుకుని ట్రస్ట్ ద్వారా 50 లక్షల రూపాయలు గ్రామాభివృద్ధికి కేటాయిస్తున్నానని ప్రకటించారు. అలాగే అధికారులతో మాట్లాడి గ్రామంలోకి వచ్చే పథకాలు అందచేస్తాను. ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ గ్రామానికి కావాల్సిన పనులు అన్ని చేసి పెడతాను. పనులు చేసి తర్వాత కొణిదెల గ్రామానికి వస్తాను! అని పవన్ వ్యాఖ్యానించడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు `కొణిదెల` బ్రాండ్ రాయలసీమ మొత్తం మార్మోగుతోంది. సహజంగానే కాపులు ఎక్కువగా ఉండే సీమ ఏరియాలను ఇది బలంగా తాకుతుందని అంచనా వేస్తున్నారు. నెమ్మదిగా సీఎం చంద్రబాబుతో స్నేహాన్ని పునరుద్ధరించుకుంటూనే, సీమలో అలయెన్స్ బలాన్ని పెంచేందుకు జనసేనాని కృషి చేస్తున్నారన్న ముచ్చటా సాగుతోంది. కొణిదెల గ్రామం.. సీమలో జనసేనాని బలం పెంచుతుందని కూడా అంచనా వేస్తున్నారు.