మోహన్‌లాల్.. ఏకంగా ప్రభాస్ రికార్డునే కొట్టేశాడు

మలయాళ సినిమాల్లో మోహన్‌లాల్ పేరు చెప్పగానే ఈమధ్య ఎక్కువగా గుర్తొచ్చే చిత్రం ‘లూసీఫర్’.;

Update: 2025-03-22 07:49 GMT

మలయాళ సినిమాల్లో మోహన్‌లాల్ పేరు చెప్పగానే ఈమధ్య ఎక్కువగా గుర్తొచ్చే చిత్రం ‘లూసీఫర్’. ఆ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌ ‘ఎల్2: ఎంపురాన్’ మరింత పవర్ఫుల్ కాన్సెప్ట్‌తో థియేటర్లకు వస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అన్ని భాషల్లో మంచి స్పందన తెచ్చుకున్నాయి. విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడుతున్న ఈ సినిమాపై ఇప్పుడు ఆసక్తికర రికార్డులు నమోదవుతున్నాయి.

తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో డబ్ అయినా ఈ సినిమా మలయాళం మార్కెట్‌లో మాత్రం అసలైన రచ్చ చేస్తోంది. మోహన్‌లాల్‌కు కేరళలో ఉన్న ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈసారి ఎల్2 సినిమా కోసం బుకింగ్‌లను చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు బుక్ మై షోలో గంటకు పదివేలు టికెట్లు బుక్ కావడమే గొప్ప విషయం అనుకునేవారు.

కానీ ఇప్పుడు టాప్ హీరోల సినిమాలు గంటల వ్యవధిలో లక్షల టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో కొత్త రికార్డు బుక్ మై షోలో ‘ఎల్2: ఎంపురాన్’ క్రియేట్ చేసింది. రిలీజ్‌కు వారం ముందే బుకింగ్స్ ఓపెన్ అయినా, తొలి 24 గంటల్లోనే 6.28 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇదే బుక్ మై షో చరిత్రలో హయ్యస్ట్ ప్రీ సేల్ రికార్డ్. గతంలో ప్రబాస్ నటించిన కల్కి 2898 ఏడీ మొదటి రోజు 3.41 లక్షల టికెట్లు మాత్రమే అమ్ముడవ్వగా, మోహన్‌లాల్ ఈ రికార్డును రెట్టింపు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ నెంబర్లు చూస్తుంటే మొదటి రోజు వసూళ్లు భారీగా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాపై మలయాళ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల్లో కూడా ఆసక్తి ఉండటంతో దేశవ్యాప్తంగా పెద్ద రిలీజే జరుగుతోంది. మాస్, క్లాస్ ఆడియెన్స్ ఇద్దరినీ ఆకట్టుకునేలా రాజకీయ ఎలిమెంట్స్‌తో కూడిన స్క్రీన్‌ప్లే ఉండబోతోందన్న బజ్ ఉంది. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్‌లో రావడం, మ్యూజిక్ డైరెక్టర్ దీపక్ దేవ్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాను గ్రాండ్‌గా నిలబెట్టబోతున్నాయి.

ఇందులో మోహన్‌లాల్ నటన మరోసారి హైలెట్ అయ్యే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ‘ఎల్2: ఎంపురాన్’ ఇప్పుడు మలయాళ సినిమా మార్కెట్‌కు కొత్త హైప్ తెస్తోంది. బుకింగ్స్ ఈ రేంజ్‌లో ఉంటే.. రికార్డుల పరంపర మొదలైపోయిందనుకోవచ్చు. ఇక అసలైన పోరు విడుదల తేదీనే చూడాలి.

Tags:    

Similar News