సూపర్ హిట్ మూవీకి ఇక్కడ మైత్రి వారి మద్దతు
మలయాళ ప్రముఖ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన 'మార్కో' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మలయాళ ప్రముఖ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన 'మార్కో' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుని భారీ వసూళ్ల దిశగా దూసుకు వెళ్తున్న 'మార్కో' సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ మద్దతుగా నిలిచారు. మలయాళంలో విడుదలకు ముందు మార్కో గురించి పెద్దగా తెలుగు ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోలేదు. కానీ అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు మంచి స్పందన దక్కే అవకాశం ఉందని రివ్యూలు రావడంతో వెంటనే మైత్రి వారు రంగంలోకి దిగి డబ్బింగ్ నైజాం రైట్స్ తీసుకున్నారు.
ఈ మధ్య కాలంలో మైత్రి వారు ఏ సినిమాను తీసుకున్నా ఎక్కువ శాతం పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయి. అందుకే నైజాం ఏరియాలో మార్కో సినిమాను పంపిణీ చేసేందుకు సిద్ధం అయిన నేపథ్యంలో ఏపీలోని ఇతర ఏరియాల్లోనూ ఈ సినిమాకు మంచి డిమాండ్ మొదలైంది. మైత్రి మూవీస్ వారు మద్దతుతో మార్కో సినిమాను నైజాం ఏరియాలో జనవరి 1న భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ అంచనాల నడుమ తెలుగులో విడుదల కాబోతున్న మార్కో సినిమా కచ్చితంగా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా మంచి వసూళ్లు సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో ఉన్ని ముకుందన్ జనతా గ్యారేజ్‌తో పాటు భాగమతి సినిమాల్లో నటించి మెప్పించాడు. తెలుగు ప్రేక్షకులకు ఉన్ని ముకుందన్ కొత్త వాడు కాకపోవడంతో పాటు, హిట్ సినిమాల్లో నటించిన కారణంగా, ఇప్పటికే మార్కోకి మలయాళంలో పాజిటివ్ రివ్యూలు వచ్చిన కారణంగా టాలీవుడ్‌లో హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మినిమం ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. కొత్త సంవత్సరం కానుకగా రాబోతున్న ఈ సినిమాకు మంచి స్పందన వస్తే తెలుగులో భారీ వసూళ్లు సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయంను సినీ వర్గాల వారు, బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వచ్చిన మార్కో తెలుగు ట్రైలర్‌కి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ దక్కింది. జనవరి 1న తెలుగులో విడుదల కాబోతుండగా, ఆలస్యం చేయకుండా జనవరి 3వ తారీకున తమిళ్‌లో విడుదల కాబోతుంది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు. సినిమాలో ఉన్ని ముకుందన్ పాత్ర తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందని, కేజీఎఫ్ రేంజ్ మూవీ అంటూ ప్రచారం జరుగుతుంది. తెలుగు, తమిళ్‌లో ఇప్పటికే బజ్ క్రియేట్ కావడంతో ఓపెనింగ్ వసూళ్లు భారీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.