ఆ 45 నిమిషాలు కారం దంచేసారు!
మహేష్ నటించిన గుంటూరు కారం 2024 సంక్రాంతి బరిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే
మహేష్ నటించిన గుంటూరు కారం 2024 సంక్రాంతి బరిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు వెంకీ- సైంధవ్, రవితేజ- ఈగిల్ కూడా పోటీలో విడుదలవుతున్నాయి. వీటితో పాటు చిన్న హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో రానున్నాయి. పండగ సీజన్ ని దృష్టిలో ఉంచుకుని ఎవరికి వారు రిలీజ్ కోసం తహతహలాడుతున్నారు.
ఇంతలోనే పోటీలో రిలీజ్ సరికాదని వారించే ప్రయత్నం జరుగుతోంది. అయితే గుంటూరు కారం సోలో రిలీజ్ కాదు కాబట్టి థియేటర్ల సమస్యను ఎదుర్కొంటుందని మహేష్ అభిమానులు కలత చెందుతున్నారు. దీనికి గుంటూరు కారం నిర్మాత నాగ వంశీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
గత రాత్రి గుంటూరు కారం విడుదల సందర్భంగా థియేటర్ సమస్యలపై చర్చించడానికి మహేష్ బాబు అభిమానులు ట్విట్టర్ స్పేస్ లో ప్రశ్నోత్తరాల సెషన్ ని నిర్వహించారు. సంక్రాంతి బరిలో పోటీపై ప్రశ్న ఎదురైంది. నిర్మాత నాగ వంశీ ఈ ఇంటరాక్షన్ లో చేరి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అతడు అభిమానుల అభ్యర్థనలను విన్నాడు. సాధ్యమైనంత ఉత్తమంగా విడుదల చేస్తామని హామీ ఇచ్చాడు. నాగ వంశీ మాట్లాడుతూ ''చివరి 45 నిమిషాల సినిమా ఫైట్ సీక్వెన్స్‌లు, భావోద్వేగాలు, కుర్చీ మడతపెట్టి వేసే స్టెప్పులతో పాటలతో అద్భుతంగా ఉంటుంది. గుంటూరు కారంతో భారీ హిట్ సాధిస్తున్నాం. థియేటర్ల సంగతి నేను చూసుకుంటాను. సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడం అభిమానుల బాధ్యత'' అని అన్నారు. నాగవంశీ మాటలు మహేష్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. తమ ఫేవరెట్ భారీ ఓపెనింగులు సాధిస్తాడని, గుంటూరు కారం పెద్ద హిట్టవుతుందని ఆకాంక్షిస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాయావి మార్క్ సినిమా. కలర్ ఫుల్ గా రంజుగా స్క్రీన్ ప్లే రక్తి కట్టిస్తుందని చెబుతున్నారు. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. ఎస్.ఎస్ థమన్ బాణీలు సమకూర్చారు. ఈ చిత్రంలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.