వైరల్ వీడియో : జపాన్‌లో 'దేవర' అరాచకం ఖాయమేనా!
మన హీరోను జపనీస్ ఇంతగా అభిమానిస్తారా అనిపించే విధంగా వారు ప్రభాస్‌ను అభిమానించే వారు. ఇప్పుడు అదే అభిమానం ఎన్టీఆర్‌కి దక్కింది.;
ఇండియన్ సినిమా హీరోల్లో అతి కొద్ది మందికి జపాన్‌లో అభిమానులు ఉంటారు. అప్పట్లో రజనీకాంత్‌కి జపాన్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది అంటారు. ముత్తు సినిమా మొదలుకుని రజనీకాంత్‌ను జపాన్‌లో ప్రేక్షకులు అభిమానిస్తూ ఉండేవారని అంటారు. ఆ తర్వాత మరి కొందరు హీరోలు సైతం జపాన్‌లో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ బాహుబలితో జపాన్‌లో ప్రేక్షకులకు ఆరాద్య దైవం అయ్యాడు. ప్రభాస్ పట్ల అక్కడి ఫ్యాన్స్ చూపించే అభిమానంకు సంబంధించిన కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మన హీరోను జపనీస్ ఇంతగా అభిమానిస్తారా అనిపించే విధంగా వారు ప్రభాస్‌ను అభిమానించే వారు. ఇప్పుడు అదే అభిమానం ఎన్టీఆర్‌కి దక్కింది.
'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిని మించి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో ఎన్టీఆర్. కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ తన నటనతో ఎన్నో దేశాల ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చేసుకున్నాడు. ముఖ్యంగా జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా వంద రోజులకు మించి ఆడటంతో పాటు, అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ సినిమాగా నిలిచింది అనే విషయం తెల్సిందే. జపాన్‌లో ఎన్టీఆర్ కి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఎంతో మంది అభిమానులు అయ్యేలా చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ విడుదలైనప్పటి నుంచి ఎన్టీఆర్ పేరు జపాన్‌లో మారు మ్రోగుతోంది. గత ఏడాది ఎన్టీఆర్ నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'దేవర' సినిమాను ఈనెలలో జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇటీవలే జపాన్‌లో దేవర స్పెషల్ ప్రీవ్యూ షో వేశారు. ఆ ప్రివ్యూ కి మంచి స్పందన వచ్చిందట. ముఖ్యంగా జపనీస్ ప్రేక్షకులు యాక్షన్ సన్నివేశాలకు, ఎన్టీఆర్ నటనకు ఫిదా అవుతారనే రివ్యూలు వచ్చాయి. ప్రీవ్యూకి వచ్చిన టాక్ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు జపాన్‌లో 'దేవర' రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 28న జపాన్‌లో విడుదల కాబోతున్న దేవర కి అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాల రేంజ్‌లో దేవర సినిమాను అత్యధిక స్క్రీన్స్‌లో విడుదల చేసేందుకు గాను అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే దేవర సినిమా ప్రమోషన్ సైతం జపాన్‌లో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
మరో వైపు ఎన్టీఆర్ జపనీస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర కటౌట్‌ను పెట్టుకుని ఆయుద పూజ పాటతో పాటు, పలు పాటలకు డాన్స్‌లు చేయడం, ఏకంగా ఎన్టీఆర్ కటౌట్‌కి పూజలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపనీస్ లేడీస్ ఎన్టీఆర్‌పై అభిమానం చూపిస్తూ చేసిన వీడియోలు చూడ ముచ్చటగా ఉన్నాయి. జపాన్‌లో ఎన్టీఆర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తూ ఉంటే దేవర సినిమా మరోసారి ప్రభంజనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా రికార్డ్‌ను దేవర జపాన్‌లో బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవర సినిమా ప్రమోషన్ కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్లడంతో అక్కడి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన దక్కింది. ఎన్టీఆర్‌ను చూసేందుకు వేలాది మంది జపనీస్ ఫ్యాన్స్ కార్యక్రమాలకు హాజరు అవుతున్నట్లు సమాచారం అందుతోంది.